ఖమ్మం బ్యూరో : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతితో ఉన్న తుమ్మలకు అధినేత, సీఎం కేసీఆర్ పాలేరు అసెంబ్లీ టిక్కెట్ ను నిరాకరించడంతో తుమ్మల అసమ్మతితో ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే లక్ష్యంతో అనుచరుల ఒత్తిడి మేరకు తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు టాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు ఆయనతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో శనివారం సాయంత్రం తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం జరగనున్న కాంగ్రెస్ విజయభేరి సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తన అనుచరులతో తుమ్మల పాల్గొననున్నారు.