ఉట్నూర్, ప్రభన్యూస్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లిdలో 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని తీర్మానించడంతో దానికి నిరసనగా సోమవారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో తలపెట్టిన ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు ఐటీడీఏ కార్యాలయానికి తరలివచ్చి ఐటీడీఏ ముట్టడి చేయడానికి ఐటీడీఏ గేట్‌ను నెట్టుకుని కార్యాల యంలోకి ప్రవేశించి నిరసన తెలిపారు. కొందరు నాయకులు ఐటీడీఏ చైర్మన్ లక్కెరావ్ వాహనాన్ని, కార్యాలయ అద్దాలను రాళ్లతో, కట్టెలతో ధ్వంసం చేసారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళన ఉధృతం కాకుండా తగు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ, ఎస్టీ జాబితాలో ప్రభుత్వం ఇతర జాతులను కలప వద్దని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో 3ను యధావిధిగా అమలుచేయాలని కోరారు. దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి తొలగించిన ఆదివాసీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలుపడంతో అధికారుల హామీ మేరకు శాంతించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గణష్, ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, ఉద్యమ నాయకులు సెడ్మకి ఆనంద్‌రావ్, మహిళా నాయకురాలు పుష్పరాణి, నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.