Tuesday, November 26, 2024

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన.. ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన టిబి గుర్తింపు..

ప్రైవేటు ఆసుపత్రులలోను ఉచిత పరీక్షలు, వైద్యం..

టిబి నిర్మూలనలో మూడు జిల్లాలకు జాతీయ అవార్డులు..

తెలంగాణలో 2025 నాటికి పూర్తి స్థాయిలో క్షయ వ్యాధి (టిబి) నిర్మూలనే లక్ష్యంగా నిర్ధేశించుకుని టిబి పరీక్షలు, వైద్యం వేగవంతం చేస్తున్నట్లు తెలంగాణ టిబి విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.రాజేశం వెల్లడించారు. ప్రతి లక్ష జనాభాకు ఏడాదికి 198 టిబి కేసులు నమోదు అవుతుండగా ఈ సంఖ్యను 2025 నాటికి 43 కి తగ్గించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా టిబి పరీక్షల సంఖ్య భారీగా పెంచడంతోపాటు వైద్య సహాయం తక్షణమే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, కార్పొరేటు, ఎన్‌జిఒ, మీడియాతోపాటు టిబి నుంచి కోలుకున్న టిబి ఛాంపియన్‌ లను భాగస్వామ్యం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24న అంతర్జాతీయ టిబి దినోత్సవం పురస్కరించుకొని పిఐబి భాగస్వామ్యంతో తెలంగాణ టిబి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక వర్క్‌ షాప్‌ నిర్వహించారు. పిఐబి డైరెక్టర్‌ శృతిపాటిల్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎ.రాజేశం తోపాటు తెలంగాణ టిబి కేంద్రం సాంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్‌ సి.సుమలత పాల్గొన్నారు.

నూతనంగా అందుబాటులోకి వచ్చిన కాట్రిడ్జ్‌ బేస్డ్‌ న్యూక్లియక్‌ యాసిడ్‌ యాంప్లిఫికేషన్‌ టెస్టింగ్‌ యంత్రాలను తెలంగాణలో నారాయణపేట జిల్లా మినహా అన్ని జిల్లా కేంద్రాలలో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. టీబీకి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచిత పరీక్షలు, వైద్యం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. శాశ్వతంగా టిబి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వ రంగంతోపాటు ఇకపై ప్రైవేటు రంగంలోనూ ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలతోపాటు వైద్యం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. టిబి వ్యాధిబారిన పడినవారికి కేంద్ర ప్రభుత్వం ”నిక్షయ్‌ పోషణ యోజన” కింద ప్రతి నెల రూ.500 చొప్పున వ్యాధి నుంచి బయడపడే వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. టిబి తీవ్రత ఎక్కువగా ఉండి మల్టి డ్రగ్‌ థెరపీ తీసుకునేవారికి రూ.1200 రవాణా ఛార్జీలు ఇవ్వనున్నట్లువివరించారు. సదస్సులో పాల్గొన్న టిబి ఛాంపియన్స్‌ షేక్‌ ఫర్హా, తరణం బేగం, వినోద్‌ తదితరులు తమ అనుభవాలు తెలిపారు. టిబి గుర్తించిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడటంతోపాటు, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement