Thursday, November 21, 2024

Ts | అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై టీఎస్‌ ఆర్టీసీ దృష్టి.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో సమానంగా సౌకర్యాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరే రూట్లపై ఆ సంస్థ యాజమాన్యం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీ అధిక ఆదాయం సమకూరుతున్న మార్గాల్లో బస్సు సర్వీసుల సంఖ్యను మరింతగా పెంచాలని నిర్ణయించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం పెరగడంతో పాటు ప్రైవేట్‌ బస్సులకు వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీకి రాబట్టడం సాధ్యమవుతుందన్న ఆలోచనలో సంస్థ ఉంది.

ముఖ్యంగా తెలంగాణ నుంచి కర్నాటకలోని బెంగళూరు, హుబ్లి, దావణగేరే, బీదర్‌, గుల్బర్గా ప్రాంతాలకు టీఎస్‌ ఆర్టీసీ ఏసీ స్లీపర్‌, సూపర్‌ లగ్జరీ ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ఈ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. తెలంగాణ నుంచి కర్నాటకకు ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య అవసరాల నిమిత్తం వెళ్లి వచ్చే ప్రయాణికులతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ రూట్లలో పలు ప్రైవేట్‌ సంస్థలు బస్సులను నడిపిస్తున్నాయి. అయితే, ప్రైవేట్‌ బస్సుల్లో టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

దీంతో రాష్ట్రం నుంచి కర్నాటకకు బస్సు సర్వీసులను పెంచడం వల్ల సంస్థకు భారీగా ఆదాయం వస్తుందని టీఎస్‌ ఆర్టీసీ భావిస్తోంది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను సంస్థ అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా, హైదరాబాద్‌ నుంచి లహరి ఏసీ స్లీపర్‌, నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను హుబ్లికి మరిన్ని సర్వీసులను పెంచింది. దీంతో ఆశించిన స్థాయిలో ఆర్టీసీకి ఆదాయం సమకూరింది. ఈ రూట్లో లహరి ఏసీ బస్సుల్లో వారాంతాలు, రద్దీ రోజుల్లో టికెట్‌ ధరలు ఎక్కువ ఉండనుండగా, సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటాయి.

రద్దీని బట్టి టికెట్ల ధరలలో హెచ్చు తగ్గుల కారణంగా ప్రైవేట్‌ బస్సులకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతారని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. తెలంగాణ-కర్నాటక మధ్య టీఎస్‌ ఆర్టీసీ అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చిందనీ, ప్రయాణికులు వీటిని ఉపయోగించుకుని సురక్షితమైన ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. కాగా, ప్రయాణికుల రద్దీని బట్టి త్వరలోనే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలోని పట్టణాలకు ప్రస్తుతం నడుపుతున్న బస్సు సర్వీసుల సంఖ్యను మరింతగా పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement