Tuesday, November 26, 2024

TSRTC – కెసిఆర్ స‌హ‌కారం..సిబ్బంది నిబ‌ద్ద‌తోనే ఆర్టీసీ న‌ష్టాల‌ను త‌గ్గించాం – మంత్రి పువ్వాడ

హైద‌రాబాద్ – ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టసీ) అన్ని చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మార్కెట్ లో పోటీకి ధీటుగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టేషన్లను అత్యాధునిక హంగులతో సుందరీకరిస్తోందని ఆయన చెప్పారు. గత ఆర్ధిక ఏడాదిలో 100 బస్టాండ్లను ఆధునీకరించగా .ఈ ఏడాదిలో 150 బస్టాండ్లను ఆధునీకరించేందుకు సంస్థ ప్రణాళిక రూపొందించదని వివరించారు.

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తో కలిసి తనిఖీ చేశారు. బస్ స్టేషన్ లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. టీఎస్ఆర్టీసీ ఉచితంగా అందిస్తోన్న టాయిలెట్ లను, మంచినీటి సదుపాయాన్ని పరిశీలించారు. ఎంజీబీఎస్ లోని స్టాళ్లను పరిశీలించి.. ఎంఆర్పీ ప్రకారమే వస్తువులను ప్రయాణికులకు విక్రయించాలని సూచించారు. తర్వాత భద్రాచలం వైపునకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించారు. టీఎస్ఆర్టీసీ కల్పిస్తోన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రంగారెడ్డి రీజియన్ పై టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఎన్నో వినూత్న కార్యక్రమాలతో సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయిందని అన్నారు. గత ఏడాది రూ.1900 కోట్ల నష్టాన్ని సంస్థకు తగ్గించగలిగామని గుర్తుచేశారు. ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదన్నారు. ఇప్పటికే 760 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, త్వరలోనే హైదరాబాద్ లో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందిందని, మెట్రో, రైల్వే, ఎయిర్ పోర్టు అథారిటీతో అనుసంధానంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

గత రెండేళ్లుగా సంస్థలోని 45 వేల మంది సిబ్బంది పట్టుదలతో పనిచేస్తున్నారని, వారు నిబద్దతతో విధులు నిర్వహించడం వల్లే సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటి వరకు 7 డీఏలను ప్రకటించామని, దాని వల్ల ఒక్కొక్కరి వేతనం 35 శాతం వరకు పెరిగిందని చెప్పారు. ప్రజ రవాణా వ్యవస్థ ప్రజలదేనని, దైనందిన జీవనంలో భాగమైన ప్రజా రవాణా వ్యవస్తును కాపాడుకోవాల్సిన బాధ్యతపై ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు.

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా సంస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, ఫలితంగా రాబడి కూడా పెరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అక్యూపెన్సీ రేషియాను 75 శాతానికి పెంచడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని తెలిపారు. ప్రజల నుంచి వస్తోన్న స్పందనను బట్టే కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నామని వివరించారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే మహారాష్ట్రలోని షిర్డీ, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలానికి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

గురు పౌర్ణమి సందర్భంగా జులై 3న తమిళనాడు అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శన ప్యాకేజీకి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. ఇప్పటికే 9 బస్సుల్లో సీట్లు నిండాయని, త్వరలోనే మరికొన్ని బస్సులను ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఒకవైపు టికెట్ ఆదాయాన్ని పెంచుకుంటూనే.. మరోవైపు టికెటేతర ఆదాయంపై సంస్థ దృష్టి సారించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే జీవా వాటిర్ బాటిళ్లు, స్నాక్ బాక్స్ తో పాటు పెట్రోల్ బంక్ ల ఏర్పాటు, లాజిస్టిక్స్ కార్గో సేవలను అందిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమాల్లో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, మునిశేఖర్, కృష్ణకాంత్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement