ప్రభ న్యూస్ బ్యూరో, గ్రేటర్ హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు టీఎస్ ఆర్టీసీ అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మారుతున్న కాలానుగుణంగా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగించు కుంటోంది. బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడానికి సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, వీసీ అండ్ ఎండీ వీసీ.సజ్జనార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 96 డిపోలు, 4170 ప్రత్యేక రకం బస్సులను బస్ ట్రాకింగ్ అమలుకోసం, ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల బస్టాపులకు చేరుకునే కచ్చితమైన సమయాలను తెలుసుకోవడానికి ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటు లోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణీకులు తాము ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడ ఉందో అరచేతిలో చూసుకునే సదుపాయం ఏర్పడింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ బస్‌ట్రాకింగ్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో మొబైల్ యాప్‌ని సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటు లో ఉన్న టీఎస్ ఆర్టీసీ రవాణా సేవలు, తెలంగాణ, సమీప రాష్ట్రాల్లోని వివిధ బస్టాప్‌ల్లో బస్సుల ఆగమనం, నిష్క్రమణంలను తెలుసుకోవడానికి ప్రయాణీకులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటు-ందన్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకులు బస్టాప్‌లు, బస్ స్టేషన్లలో నిరీక్షణ సమయాన్ని నివారించడానికి వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు. ప్రయోగాత్మకంగా 140బస్సులను గుర్తించామని, వీటిలో కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులను వివిధ మార్గాల్లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు, సుదూర ప్రాంతాలకు మియాపూర్-1 డిపోకు చెందిన 100 బస్సులను నడుపుతున్నట్లు- ఎం.డి వెల్లడించారు.
శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం వంటి రూట్లలో నిర్వహిస్తున్న పీకేటీ- డిపోలను ప్రస్తుతం ట్రాక్ నడుస్తుందని, మరో రెండు నెలల్లో జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్‌లో చేర్చనున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్‌లో ప్రయాణీకులు తమ ప్రదేశానికి సమీపంలో ఉన్న బస్టాప్ వద్ద బస్సు రాక గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం జరుగుతుందన్నారు. విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌లకు కనెక్ట్ చేయడం ద్వారా వారి ప్రయాణ ప్రణాళికకు మెరుగైన సమన్వయాన్ని అందిస్తుందన్నారు. హైదరాబాద్ సిటీ-, డిస్ట్రిక్ట్ సర్వీస్‌లలో వేర్వేరుగా బస్సులను ట్రాకింగ్ చేయవచ్చని, మూలం, గమ్యస్థాన పాయింట్ల కోసం ఆశించిన రాక సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం 24/7 నడిచే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎలక్ట్రిక్ బస్సుల (పుష్పక్) కోసం ఎంతో సౌలభ్యంగా ఉంటు-ందన్నారు. జిల్లాలోని గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్ అండ్ ఎక్స్‌ప్రెస్ బస్సుల వంటి ప్రత్యేక రకాల సేవల కోసం స్థలాలు, స్టేజీల మధ్య బస్సు సర్వీసుల సమాచారం సులభంగా ట్రాకింగ్ చేయవచ్చన్నారు. హైదరాబాద్ సిటీ-లో పుష్పక్ (విమానాశ్రయ సేవలు), మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్ అండ్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల వంటి ప్రత్యేక రకాల సేవల కోసం శోధించవచ్చన్నారు. బస్సు నెంబర్ ద్వారా చేరుకునే సమయాన్ని తెలుసుకోవడానికి సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పారు.
యాప్‌లో ప్రస్తుత లొకేషన్, సమీప బస్టాప్‌ను వీక్షించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చన్నారు. టి.ఎస్.ఆర్.టి.సి నుంచి మహిళా హెల్ప్‌లైన్, బ్రేక్‌డౌన్‌లతో పాటు- ప్రమాదాలు ఏవైనా ఉంటే నివేదించడం వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రయాణికులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, యాప్‌లో మరిన్ని మెరుగుదలల కోసం వారి విలువైన సూచనలను అందించాలని వి.సి అండ్ ఎం.డి అభ్యర్థించారు. ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్ ప్రవర్తన, బస్సు పరిస్థితి, డ్రైవింగ్‌పై తమ అభిప్రాయాన్ని అందించవచ్చన్నారు. టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీ-ఎస్‌ఆర్టీసీ.తెలంగాణ.జీఓవీ.ఇన్ లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా అందించబడిందని ఆయన చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.