Wednesday, November 20, 2024

TSRTC – మ‌న్డే మ‌నీ డే … ప్ర‌యాణీకులుతో కిక్కిరిసిపోతున్న బ‌స్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆదాయం పెంచుకునే దిశగా టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం చేపడుతున్న ప్రత్యేక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వివిధ పనులపై ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రతీ సోమవారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) భారీగా పెంచడం ద్వారా అధిక ఆదాయం పొందేలా ప్య్రత్యేక చర్యలు చేపట్టింది. గత సోమవారం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కస రత్తు సత్ఫలితాలు ఇవ్వడంతో ఇక నుంచి ప్రతీ సోమవారం ఇదే ప్రణాళిక అమలు చేయాలని టీఎస్‌ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేశారు. డిపోలలో స్పేర్‌లో ఉన్న బస్సులన్నింటినీ రోడ్డెక్కించడంతో పాటు వీలైనంత వరకూ సిబ్బంది సెలవుల్లో లేకుండా చూస్తున్నారు.

దీంతో పాటు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను గుర్తించి ఆ మార్గాలలో అదనపు బస్సు సర్వీసులను నడపడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా ఆర్టీసీ యాజమాన్యం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో సఫలీకృతమవుతోంది. కాగా, టీఎస్‌ ఆర్టీసీకి టికెట్ల రూపంలో ఈనెల 15న సోమవారం రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆదాయం సమకూరింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 96 డిపోలకు గాను ఏకంగా 73 డిపోలు లాభాలను ఆర్జిం చాయి. దాదాపు ఇంతే స్థాయిలో గత సంస్థకు ఆదాయం రూ.18.71 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత , హోలీ రోజు మాత్రమే ఆర్టీసీ రూ.20 కోట్ల ఆదాయాన్ని సాధించింది. కానీ ఎలాంటి పండుగ లేనప్పటికీ గత రెండు సోమవారాల్లో ఈ స్థాయి ఆదా యం రావడం తొలిసారని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారాల్లో దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఆదాయం సమకూరింది. టార్గెట్‌ను మించి 116 శాతం ఆదాయం నమోదు కావడం, ఆక్యుపెన్సీ రేషియో 79.33 శాతానికి చేరుకోవడం విశేషం. దీంతో ఇకపై వచ్చే ప్రతీ సోమవారం రూ.20 కోట్లు ఆదాయం వచ్చేలా చూడాలని ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోల మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శని, ఆది వారాలు సెలవు రోజులు కావడంతో ఆ రెండు రోజుల్లో ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేయరనీ, అందువల్ల సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా పలు పనులు, ఉద్యోగాల నిమిత్తం గ్రామాలు మొదలుకుని నగరాల వరకు రాకపోకలు సాగించే అవ కాశం ఉన్న కారణంగా ఆ రోజు సిబ్బంది అందరికీ ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లకు సెలవులు రద్దు చేసింది.

ఇక జూన్‌ రెండో వారం నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభం కానున్న దృష్ట్యా మొదటి వారం నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల నిమిత్తం ప్రయాణాలు సాగిస్తుంటారనీ, దీని దృష్ట్యా అన్ని డిపోల సిబ్బంది అప్రమత్తంగా ఉండి సంస్థకు నిర్దేశించిన ఆదాయం స మకూరే దిశగా కృషి చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు ఈ నెల చివరి వారం నుంచి వచ్చే జూన్‌ రెండో వారం వరకూ వివాహాది శుభ కార్యాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న దృష్ట్యా ఎక్కువ ట్రిప్పులు నడిపి సాధ్యమైనంత మేర ఆదాయం రాబట్టాలని సూచించారు. ఆఫ్‌ సీజన్‌లో ఏమీ చేయలేమనీ, వివాహాలు, ఇతర శుభకార్యాలతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సాధ్యమైనన్ని ఎక్కువ బస్సు సర్వీసులను నడిపి సంస్థకు అధిక ఆదాయం సమకూరేలా చర్యలు చేపడుతున్నామని టీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement