Sunday, November 17, 2024

గ్రూప్ 1పేప‌ర్ అమ్మ‌కంలో చేతులు మారిన కోట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో తవ్విన కొద్దీ లింకులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. రోజుకో కొత్త విషయాలు, నిందితుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఒకరిద్దరే ఉన్నారుకుంటే కొత్త కొత్త పేర్లు తెరమీదకు రావడమనేది కలకలం రేపుతోంది. భారీ స్థాయిలో పేపర్‌ లీకేజీ స్కాం జరిగినట్లు తెలుస్తోంది. గ్రూప్‌-1, ఏఈ ప్రశ్నపత్రాలను బేరానికి పెట్టి అంగట్లో సరుకులా అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు రూ.లక్షల్లోనే పేపర్లను అమ్ముకున్నట్లు సమాచారం. ఒకరు రూ.6 లక్షలకు విక్రయిస్తే, మరొకరు రూ.10 లక్షలు, ఇంకొకరు రూ.13.. 14 లక్షలకు ఇలా ఇష్టమొచ్చినట్లు ఎవరకి వారు పేపర్లను అమ్ముకున్నట్లు ‘సిట్‌’ ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. పేపర్ల అమ్మకం ద్వారా రూ.కోట్లల్లో చేతులు మారినట్లు సిట్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలి భర్త దాక్య నాయక్ నుంచి పేపర్ కొనుగోలు చేసిన దిండిడీ గ్రామనికి చెందిన యువకుడిని నేడు సిట్ అరెస్ట చేసింది.. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కి చేరింది..
ఇక పేపర్‌ లీకేజీతో సంబంధం ఉన్న నిందితులు ఒక్కొక్కరుగా ఇంకా బయటకి వస్తూనే ఉన్నారు. ఈ రకంగా చూస్తే లీకైన పేపర్లు పదుల సంఖ్యల్లో నిందితుల చేతులు మారి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిందితులను పసిగట్టడంలో సిట్‌కు కత్తిమీద సాములా తయారైంది. ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, దాక్య, రాజేశ్వర్‌ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌కు సహకరించడం లేదని సిట్‌యే ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నిందితులు గనుక అధికారులకు సహకరిస్తూ లీకేజీలో ఇంకా ఎవరెవరు ఉన్నారో చెబితేగానీ పెద్ద సంఖ్యలో పేర్లు బయట వచ్చే అవకాశం లేకపోలేదు. గతంలో అరెస్టు అయిన 9 మంది నిందితులను ఆరు రోజుల పాటు విచారించారు. కానీ, ఆ విచారణలో నిందితులు సరైన సమాచారం చెప్పలేదు. మరికొంత మంది నిందితులను రక్షించే ప్రయత్నంలో భాగంగానే వారి గురించి సమాచారం ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దర్యాప్తు ముమ్మరం…
గ్రూప్‌-1, ఏఈ పేపర్లను ఎవరెవరికి చేరిందనే కోణంలో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. పేపర్‌ లీకేజీలో రేణుక భర్త దాక్య ఎంత మందితో బేరం చేశారో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ప్రవీణ్‌, రాజశేఖర్‌, దాక్య, రాజేశ్వర్‌లను ఆదివారం సిట్‌ తన కస్టడీలోకి తీసుకుంది. వీరిని ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాక్య, రాజేశ్వర్‌లు ఇంకా ఎంత మందికి పేపర్లు అమ్మారనే వివరాలను రాబడుతున్నారు. ఉపాధి హామీ పతకంలో పనిచేస్తున్న ప్రశాంత్‌కి దాక్య ఏఈ పేపర్‌ను అమ్మేయడంతో శుక్రవారం ప్రశాంత్‌ని సిట్‌ అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న యువకులను లక్ష్యంగా చేసుకొని షాద్‌నగర్‌కు చెందిన రాజేంద్రకు ఏఈ పేపర్‌ను దాక్య విక్రయించినట్లు సమాచారం. మరో ఇద్దరికి కూడా ఆయన పేపర్లు అమ్మేందుకు పన్నాగం పన్నినట్లు తెలిసింది. ఏఈ పేపర్‌ లీకేజీలో ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలకు బేరం పెట్టుకొని, పరీక్షకు ముందు రూ.5 లక్షలు, తర్వాత మరో రూ.5 లక్షలు ఇచ్చేలా పథకం రచించినట్లు సమాచారం.

100కు పైగా మార్కులొచ్చిన వారికి సిట్‌ ఫోన్లు…
గ్రూప్‌-1లో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థుల జాబితాను సిట్‌ అధికారులు సిద్ధం చేసి ఫోన్‌ ద్వారా వారికి సమాచారం అందించి సిట్‌ కార్యాలయానికి రావాలని సూచిస్తున్నారు. అభ్యర్థుల బయోడేటాతోపాటు, వారు ఏం చేస్తున్నారో వివరాలను అడిగి నమోదు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాశారు? యూపీఎస్సీ పరీక్షలు రాసి ఉంటే వాటి సమాచారాన్ని కూడా తీసుకున్నారు. అయితే ఎలాంటి పొరపాటు చేయకుండా నిజాయితీగా పరీక్ష రాసిన వారికి ఎలాంటి భయం అవసరం లేదని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement