హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: గ్రూప్-1తో సహా రద్దయిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తాజా నోటిఫికేషన్ల ప్రకటన ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నోటిఫికేషన్లను ఫిబ్రవరి నెల చివరివారంలో ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నా.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇందుకు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ డీజీపీ, ఐపీఎస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి నోటిఫికేషన్ల జారీపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మహేంర్ రెడ్డితో పాటు మరో ఐదుగురిని సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించినా అందులో ఇంకా ఇద్దరు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. రద్దయిన నియామక పరీక్షలు గ్రూప్-1 వంటి మిగతా పరీక్షల నోటిఫికేషన్ల జారీకి సంబంధించి నూతన చైర్మన్ కమిషన్ కార్యదర్శి నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరినట్టు తెలుస్తోంది.
లోక్‌సభకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్!
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో జారీ అయ్యే అవకాశం ఉన్నందున ఈ లోపే నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేక ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నోటిఫికేషన్ జారీ అయి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ఒకవేళ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి నోటిఫికేషన్ల జారీకి అనుమతి కోరినా.. అంగీకరించకపోతే అనవసర ఇబ్బందులు ఉంటాయన్న భావనతో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే నోటిఫికేషన్ల విషయంలో సర్వీస్ కమిషన్ మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి వస్తే ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించేవరకు జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం లేదు. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన నాటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. మార్చి నెల చివరిలో లేదా ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగి ఫలితాలను ఆ నెల చివరి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు మే నెలలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయని, నిరుద్యోగ యువత అప్పటివరకు పరీక్షలకు సిద్ధం కావాల్సిందేనని తెలుస్తోంది.
ఫిబ్రవరిలో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చేనా?!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను ఎప్పుడెప్పుడు జారీ చేసేది తేదీలు ఏ నెలలో అన్నది ప్రకటించింది. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నియామకాల నోటిఫికేషన్ జారీ చేస్తామని జాబ్ క్యాలెండర్‌లో పేర్కొంది. ఫిబ్రవరి 1కి ఇంకా రెండ్రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని టీఎస్‌పీఎస్‌సీ వర్గాలు చెబుతున్నాయి.
విడదల వారీగా నియామకాలు..
గ్రూప్-3 నియామకాలను రెండు విడతల్లో చేపడతామని, మొదటి విడత జూన్ 1న రెండో విడత డిసెంబర్ 1న అని జాబ్ క్యాలెండర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గ్రూప్-4 నియామకాలను కూడా రెండు విడతల్లో నిర్వహిస్తామని చెప్పింది. ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్లను ఏప్రిల్ 1న ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్లు, ఆబ్కారీ ఇతర యూనిఫామ్ సిబ్బంది భర్తీకి మార్చి నెల 1న తొలివిడత డిసెంబర్ 1న రెండో విడత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటిస్తామంది.
రద్దయిన పరీక్షలకు మళ్లీ..
ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన గ్రూప్-1, డీఏఓ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పరీక్షలను తాజాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు.. వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షలను జరపాల్సి ఉంది. గ్రూప్-3, హాస్టల్ వెల్‌ఫేర్ అధికారుల నియామకానికి సంబంధించిన పరీక్షల తేదీలను కూడా ప్రకటించాల్సి ఉంది. గ్రూప్-4 పరీక్ష నిర్వహించి ఆరు నెలలవుతున్నా ఫలితాలను ప్రకటించలేదు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి పరీక్ష జరిపినా ఫలితాల అతీగతీ లేదు. రద్దయిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వడం, వాయిదా వేసిన పరీక్షలను నిర్వహిస్తూనే కొత్త ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీఎస్‌పీఎస్‌సీ పాలక మండలి ఈ అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్న విద్యావేత్తలు, పరిశీలకులు అంటున్నారు.