హైదరాబాద్, ఆంధ్రప్రభ: సిట్ అధికారుల విచారణలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీకు సంబంధించిన రోజుకొక సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతున్నది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు మహిళలను నేడు సిట్ అరెస్ట్ చేసింది.. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 12కి చేరింది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1 పరీక్ష రాసి ప్రిలిమ్స్‌లో అధిక మార్కులు సాధించిన 10 మందితోపాటు మరికొందరికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ప్రధాన నిందితులతో సంబంధాలు కొనసాగించి, లీకైన గ్రూప్-1 పేపర్‌తో పరీక్ష రాసిన వారి ఆధారాలు నిర్ధారించిన సిట్.. సురేశ్‌తోపాటు మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నది. ఆ ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది. గ్రూప్-1లో వంద మార్కులకుపైగా వచ్చిన దాదాపు 120 మందిని గుర్తించిన సిట్.. వారిని విచారిస్తున్నది. ఇందులో 20 మంది టీఎస్‌ఎపీస్సీలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. వారిలో 10 మంది క్వాలిఫై కాగా, ముగ్గురికి 120 కంటే ఎక్కువగా మార్కులు వచ్చాయి. దీంతో టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌లోనే సుమారు 42 సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తున్న సుమారు 20 మంది వరకు ఉద్యోగులు గ్రూప్-1 పరీక్ష రాశారు. వీళ్లంతా కలిసి ఏకంగా ప్రశ్నపత్రాలను ఒకరినొకరు పంచేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒకే రూములో ఉంటూ పరీక్షకు సన్నద్ధమైనట్లు సమాచారం. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఏఈ, గ్రూప్-1 రెండు పరీక్షలు రాసినట్లు సమాచారం. అయితే గ్రూప్-1 పరీక్ష రాసిన ఉద్యోగులతో పాటు మిగిలిన సిబ్బందికి కూడా నోటీసులు పంపించి అధికారులు ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీకేజీలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీగ లాగుతున్న కొద్దీ పేపర్ లీకేజీ డొంక కదులుతోంది. పేపర్ లీకేజీలో టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తున్న చాలామంది హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉద్యోగులను సిట్ ప్రశ్నిస్తోంది.
ఇప్ప టికే కాన్ఫిడెన్షియల్ రూం ఇన్‌ఛార్జ్ శంకర్‌లక్ష్మీని సిట్ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు. నిందితుల కాల్‌డేటా ఆధారంగా ప్రధా నంగా సిట్ అధికారులు విచారణ జరపుతున్నారు. నిందితులు ఎవరె వరికి కాల్ చేసి, ఏం మాట్లాడారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పరీక్షలకు ముందు వారం పది రోజుల నుంచి ఎవరు ఎవరితో మాట్లాడారు అని ఆరా తీస్తున్నారు. రేణుక, దాక్యానాయక్‌లు పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే రేణుకా కాల్‌డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ నోటీసులు ఇచ్చే యోచనలో సిట్ ఉన్నట్లు తెలు స్తోంది. ఒకవేళ కోచింగ్ సెంటర్లకు పేపర్లు చేరాయని పోలీసులు విచా రణలో వెల్లడైతే టీఎస్‌పీఎస్‌సీపైన లక్షలాది మంది నిరుద్యోగులకు నమ్మకం పోనుంది.
ఫస్ట్ గ్రూప్-1 పేపర్ లీక్.. ఆతర్వాతే మిగిలినవి..!
పేపర్లను లీక్ చేయాలనే దురుద్దేశం ముందు నుంచే ప్రవీణ్, రాజశేఖర్‌లకు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ముందు గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీని పకడ్బందీగా చేసిన తర్వాతనే ఇతర పేపర్లను ప్రవీణ్, రాజశేఖర్ లీక్ చేసినట్లు ఆధారాలు దొరికాయి. ప్రశ్నపత్రాల పేపర్ లీకేజీలో అన్నింటికన్నా ఏఈ ప్రశ్నపత్రం లీకేజీతోనే నిందితులు భారీగా లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా 9 మందితోపాటు మరికొంత మంది అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తుంటే రోజుకొక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ లీకేజీలో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న సిట్ అధికారులు… నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తోంది. వీరితో పాటు నిందితులుగా ఉన్న రేణుక, దాక్యానాయక్ దంపతుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించినట్లు తెెలిసింది.
రాజశేఖర్, సురేష్ మధ్య సంబంధాలపై ఆరా….
ఏ చిన్న అనుమానం వచ్చినా సిట్ అధికారులు అందర్నీ విచారిస్తు న్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ అధికారిని శంకర్‌లక్ష్మీని పాస్‌వర్డ్ విషయంలో రెండుసార్లు ప్రశ్నించిన అధికారులు టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తున్న అందిరినీ విచారించే పనిలో ఉన్నారు. టెక్నికల్ సిబ్బందిని పిలిచి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 42 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్‌సీ సిబ్బంది ఎంత మంది గ్రూప్-1, ఏఈ పరీక్షలు రాశారు? అందులో ఎంతమందికి 100 మార్కులు వచ్చాయి? అనే విషయంపై సిట్ అధికారులు దర్యాప్తు చేపడుతు న్నారు. ఆఫీస్ సిబ్బంది 20 మంది కలిసి గ్రూప్-1 పరీక్షను రాసినట్లు తెలిసింది. వీరిలో ఇప్పటికే ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులకు సిట్ నోటీసులు అందజేసింది. వీరిలో సురేష్ అనే ఉద్యోగిని సిట్ బుధవారం ప్రశ్నించింది. గ్రూప్-1 ఉద్యోగాలకు యమ క్రేజ్ ఉండడంతో వాటిమీద కన్నేసిన టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులు ఇలా పేపర్లు లీకులో భాగస్వాములు అయినట్లు తెలుస్తోంది. శంకరలక్ష్మీని, మరో మహిళా ఉద్యోగిని మంగళవారం రాత్రి వరకు సిట్ విచారించింది. వీరిద్దరూ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 8 మంది ఉద్యోగులకు కూడా పరీక్షలు రాసినట్లు గుర్తించారు. ప్రవీణ్, శంకరలక్ష్మీల స్టేట్‌మెంట్ కీలకంగా మారింది. ఈ క్రమంలోనే సురేష్ అనే మరో ఉద్యోగిని కూడా సిట్ ప్రశ్నించింది. అయితే రాజశేఖర్, సురేష్ మధ్య ఉన్న సంబంధాన్ని పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఐదుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసి విచారించింది. గ్రూప్-1, ఏఈ పరీక్షలు ఇంకా ఎవరెవరు రాశారు. ఎన్ని మార్కులు వచ్చాయి? అనే వివరాలు రాబడుతు న్నారు. ఐదోరోజు విచారణలో భాగంగా సీసీఎస్ నుంచి హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి తరలించి నిందితులను విచారిం చారు. ఈనెల 5న జరిగిన ఏఈ ప్రశ్నపత్రంతో పాటు ఇతర ఎన్ని ప్రశ్నపత్రాలను ఎంతమందికి పంపించారనే వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.