సెప్టెంబర్ 10వ తేది నుంచి ఎగ్జామ్స్
సెప్టెంబర్ రెండు నుంచి హాల్ టికెట్స్
ఆలస్య రుసుంతో ఈ నెల ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్, – తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2024 పరీక్ష తేదీ మారింది. రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 తేదీలను మార్చినట్లు టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో సెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా యూజీసీ నెట్ సవరించిన పరీక్షల షెడ్యూల్ అదే తేదీలలో ఉండటంతో సెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా ప్రకటించిన తేదీల ప్రకారం సెట్ పరీక్షలు సెప్టెంబరు 10 నుంచి మొదలవుతాయని తెలిపారు. దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు ఆగస్టు 24, 28 తేదీల్లో అవకాశం ఇవ్వనున్నట్లు వివరించారు.
హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి సెప్టెంబరు 2 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. టీజీసెట్ దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసింది. రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు ఆగస్టు 6 వరకు సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET – 2024) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం మే 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభంకాగా, ఆగస్టు 6 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
పరీక్ష ఎలా ఉంటుందంటే..
తెలంగాణ సెట్ పరీక్ష జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 2 పేపర్లకు జరుగనుంది. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. పూర్తి వివరాలకు www. te langanaset.org, www. osma nia.ac.inను సంప్రదించాలన్నారు.