Thursday, November 21, 2024

TS – శివలింగంపై నిజాం శాసనం

తరతరాల చరిత్రకు ఆనవాళ్లు
శ్రీశైలం దారిలో కొల్లంపెంటలో లభ్యం
8వ నిజాం నవాబు మొక్కలు నాటారని వెల్లడి
శాసనంలో తెలుగు పంక్తులకు స్థానం
వివరాలు తెలిపిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం

తెలంగాణ గడ్డలో… అడుగడుగునా చరిత్ర పలకరిస్తుంది. గతాన్ని గుర్తు చేస్తుంది. తరతరాల కథల్ని కళ్లకు కడుతుంది. ఇటీవలే శ్రీశైలం మల్లన్న గుడికి భక్తులు వెళ్లే మార్గంలో అమ్రాబాద్ మండలం కొల్లంపెంట సమీపంలోని అడవిలో శివలింగంపై ఫార్సీ భాషలో నిజాం నవాబు శాసనం కనిపించింది. శైవ చరిత్రలో ఇంతకు మునుపు ఎక్కడా శివలింగంపై శాసనం దొరికిన దాఖలా లేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ చెప్పారు. ఈ శాసన సారాంశం ఏమిటంటే.. హైదరాబాద్ రాజ్య 8వ నవాబు నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా, ముకరం ఉద్ దౌలా బహదూర్ కొలువులోని జైన్ చంద్ర అనే సుంకం అధికారి 1350 హిజ్రి 3 వ జిల్హిజి అంటే 1932 ఏప్రిల్ 9న అక్కడి బంజరులో మొక్కలు నాటించిన విషయాన్ని శివ లింగంపై చెక్కారు. ఇదే లింగంపై తెలుగులోనూ చెక్కిన శాసన వాఖ్యలు కని పించాయి. అయితే.. ఆ ఫొటో సమకూరలేదు. ఈ శాసనం చదివి వివరించిన చరిత్ర బృందంలో అబ్బాస్ అలీ, అబ్దుల్ వాహెద్, అబ్దుల్ బాసిత్, కందుల వేంకటేశ్, దాసరి మల్లికార్జున్, సతీశ్ గాంధీ ఉన్నారు. గాజుల బసవరాజు, నర్సింహులు (యాలాల) ఈ ఫొటోను సమకూర్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement