కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో – మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎల్అండ్ టీ సంస్థను కరీంనగర్ మాజీ ఎంపీ బెదిరించడంతో అతడి బంధువులకు సబ్ కాంట్రాక్టు ఇచ్చారని, సబ్ కాంట్రాక్టర్లను అరెస్టు చేయాలని ఎంపీ బండి సంజయ్ గాలిమాటలు మాట్లాడుతున్నారని…గిసొంటి సోయిలేని మాటలు మానుకుని అసలు నిజాలేంటో నిరూపించాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్అండ్ టీ సంస్థ మేడిగడ్డ సబ్ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చిందో తెలిస్తే పేరు బయట పెట్టాలని, అసలు మాజీ ఎంపీ ఎవరో, అతడి బంధువులు ఎవరో చెప్పాలని, బండి సంజయ్ ఎవరిని అన్నారో చెప్పాలని అన్నారు.
తాను 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నానని, అంతకు ముందు పొన్నం ప్రభాకర్, కేసీఆర్, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఎల్.రమణ ఎంపీలుగా ఉన్నారని ఇందులో ఎవరి బంధువులకు మేడిగడ్డ బ్యారేజీ సబ్ కాంట్రాక్టు ఇచ్చారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఎల్అండ్ టి సంస్థ సబ్ కాంట్రాక్టు ఇచ్చిందా లేదా అనే విషయాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అడిగి బయట పెట్టాలని బండి సంజయ్‌ని కోరారు. ఎంపీగా గెలిచి ఐదేళ్లు గడిచినా బండి సంజయ్ కి ప్రజలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్లీ ప్రజలు గుర్తుకు వచ్చారని, ఐదేళ్లలో ఐదు కొత్త నిధులు తేలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంలో జ్యుడిషియల్ విచారణ జరిపితే అభ్యంతరం లేదని, బీఆర్ఎస్ పార్టీ గతంలోనే చెప్పిందని విచారణ తో పాటు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చెప్పాలని, ప్రస్తుత యాసంగి సీజన్ లో సాగు నీటి కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే మేడిగడ్డ నుంచి నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు.