(ప్రభన్యూస్ ప్రతినిధి, వికారాబాద్) – వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జెడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 12 మంది తీర్మానంపై సంతకాలు చేశారు. శుక్రవారం సునితారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 24 గంటల్లోనే బీఆర్ఎస్ అధిష్టానం వేగంగా పావులు కదిపి సునితారెడ్డిపై అవిశ్వాసం పెట్టించింది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ దుమారం రేగింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి. శనివారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 12 మంది జెడ్పీటీసీలు చైర్ పర్సన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. ఇందులో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు జెడ్పీటీసీలు ఉండడం గమనార్హం.
18 మందిలో ఇద్దరే కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు
వికారాబాద్ జిల్లా పరిషత్ లో మొత్తం 18 మంది జెడ్పీటీసీలున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఇద్దరు (యాలాల, బొంరాస్ పేట్ మండలం) అవిశ్వాసంపై సంతకం చేయలేదు. అవిశ్వాసానికి అవసరం అయిన 12 మంది సంతకాలు చేయడం గమనార్హం. కొడంగల్ కు చెందిన ఇద్దరు జెడ్పీటీసీలు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలకు చెందిన నలుగురు చొప్పున, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఒక్కో జెడ్పీటీసీ తీర్మానంపై సంతకాలు చేశారు.
అదనపు కలెక్టర్‌కు తీర్మానం అందజేత..
కాంగ్రెస్ పార్టీలో చేరిన జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని శనివారం బీఆర్ఎస్ జెడ్పీటీసీలు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ కు అందించారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి వెంటనే వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం గమనార్హం. పార్టీ అధిష్టానం వీరందరిని రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం.