హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీచర్ల బదిలీలు, పదోన్నతుల కేసు మరోసారి వాయిదా పడింది. ఈనెల 18 వరకు బదిలీలు, పదోన్నతలపై స్టే పొడిగిస్తూ హైకోర్టు కేసును వాయిదా వేసింది. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో స్పౌజ్ బదిలీలు కూడా ఉన్నాయి. అయితే టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ఆఫీసు బేరర్లకు అదనపు పాయింట్లు ఇవ్వడం విరుద్ధమని హైకోర్టులో పలువురు ఉపాధ్యాయులు పిటిషన్ దాఖలు చేశారు.
బదిలీలకు సంబంధించిన అధికారం అధికారులకు ఉండదని అది చట్టసభలకు ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇవేమి లేకుండా ప్రభుత్వం జీవో రూపంలో నిబంధనలు తీసుకొచ్చిందని బాధిత సంఘాలు అంటున్నాయి. అయితే దీనిపై విచరాణ జరిపిన కోర్టు స్టేను కొనసాగిస్తూ కేసును వాయిదా వేసింది. ఇప్పటికే ఈకేసు పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనేపథ్యంలో మంగళవారం తాజాగా ఈ కేసు విచారణకు రావడంతో ఈనెల 18 వరకు కోర్టు స్టేను కొనసాగిస్తూ కేసు వాయిదా వేసింది. కేసు మరోసారి వాయిదా పడడంతో టీచర్లు ఆందోళనలో ఉన్నారు.