ఇప్పుడంతా హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా ఆ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడమే కాదు.. పలు హామీలను ఇస్తున్నారు. ఈ ఎన్నికల బాద్యతని మంత్రి హరీశ్ రావు భుజాలపై పెట్టారు కేసీఆర్. దాంతో అన్నీ తానై నడిపిస్తున్నారు హరీశ్ రావు.
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ముమ్మరంగా చేపట్టిన ప్రచారపర్వం చివరిదశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు టిఆర్ ఎస్ నేతలు. ఈ సమయంలో పార్టీలు చెప్పే మాటలు, భావోద్వేగ ప్రసంగాలు పోలింగ్ వరకు ప్రజలకు గుర్తుంటాయి.
ఇక హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సింగాపురం గ్రామంలో మంత్రి హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు అన్నం పెట్టిన ఊరు ఈ సింగాపురం అని తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్ తో పాటు తనకు కూడా ఈ ఊరు ఆతిధ్యం ఇచ్చిందని.. ఇప్పుడు మరోసారి మమ్మల్ని ఆశీర్వదించాలని హరీష్ కోరారు.
నాకు అన్నం పెట్టిన సింగాపురం గ్రామమంటే నాకెంతో ఇష్టం. మీరంతా మాకు అండగా నిలవాలి. టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. మీరు ఆశీర్వదిస్తే ఇంకా కష్టపడి పని చేస్తాం. మీ రుణం తీర్చుకుంటాం అని అన్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. ఆర్థిక మంత్రిగా అందరికి అండగా ఉంటా.. దగ్గరుండి పనులు చేయిస్తా.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును మరింత జోష్ తో ముందుకు తీసుకుపోతామని మంత్రి హామీ ఇచ్చారు.
దళితదబంధులాంటి పథకాలతో పాటు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే పలు పథకాలను తీసుకువస్తామని..తమని గెలిపించాలని అభ్యర్థించారు. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి.