Friday, November 22, 2024

TS: వంద రూపాయల కోసం ఆస్పత్రిలో వార్డుబాయ్ ఆ ప‌నిచేశాడ‌ట‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వంద రూపాయల కక్కుర్తి… మూడేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. కేవలం 100 రూపాయలకు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్‌ పైపును మరో రోగికి అమర్చాడు. దీంతో ఆ చిన్నారి ఆక్సిజన్‌ అందక ఉక్కిరిబిక్కిరి అయి కోమాలోకి పోయి కన్నుమూశాడు. అటెండర్‌ కక్కుర్తి మూడేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

బోరబండకు చెందిన షేక్‌ అజం కుమారుడు షేక్‌ ఖాజా(3) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఈ నెల 27న నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో పనిచేస్తున్న సుభాష్‌ అనే అటెండర్‌ శనివారం వార్డుకు వచ్చాడు. పక్క బెడ్‌మీద ఉన్న రోగి సహాయకుల నుంచి వంద రూపాయలు తీసుకుని షేక్‌ ఖాజాకు అమర్చిన వెంటిలేటర్‌ను మార్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే షేక్‌ ఖాజా శ్వాస అందక మృతి చెందాడు. బాలుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. బాధితులను ఓదార్చారు. ఆస్పత్రి సిబ్బంది తీరు, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు బాయ్‌తోపాటు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలుడి మృతిపై స్పందించిన నీలోఫర్‌ వైద్యులువార్డు బాయ్‌ సుభాష్‌ను సస్పెండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement