భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి తల్లి శంకరమ్మ నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీని టికెట్ అడిగానన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ తనకు టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని శంకరమ్మ అన్నారు. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించకుండా తనకు మద్దతివ్వాలన్నారు. ఇదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవమన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10ఏళ్లుగా న్యాయం జరగలేదన్నారు. నా బిడ్డతో పాటు 1000 మంది బిడ్డలు అమరులయ్యారు.. ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు చట్ట సభల్లో కానీ, కనీసం నామినేటెడ్ పదవులు కూడా రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారు.. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు అమరవీరుల కుటుంబాలను గుర్తించాలన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతచారి తల్లిగా ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్లు శంకరమ్మ తెలిపారు.