హైదరాబాద్, ఆంధ్రప్రభ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీపీపీ రవి గుప్తా తెలిపారు. ఈక్రమంలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాలలో 350 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించామన్నారు.
క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో కేంద్ర సాయుధ బలగాలు, గ్రే హౌండ్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలతో అనుసంధానమైన కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను అరికట్టెందుకు సైబర్ పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. సైబర్ క్రైమ్ బ్యూరో బృందాలు ప్రత్యేక నిఘాను పెట్టాయని పేర్కొన్నారు. లక్ష సిబ్బందితో బందోబస్తు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తరువాత స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు- చేస్తామని డీజీపీ రవి గుప్తా తెలిపారు.