వరంగల్: వాహనదారులు క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడమే తమ లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు అమలుచేయడంలో సోమవారం హన్మకొండ అశోక జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి హెల్మెట్ ధరించని వాహనదారులతో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాహన యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు జరిమానా విధించాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ అదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు ట్రై సిటీ పరిధిలోని ట్రాఫిక్, లాఅండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించాం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయం కావడంతో ద్విచక్ర వాహనదారులు చనిపోవడం జరుగుతోంది. హెల్మెట్ ధరించడం ద్వారా ఈ మరణాలను నియంత్రించవచ్చు. ఆలాగే ఈ మధ్య కాలంగా ట్రిపుల్ డ్రైవింగ్, నంబర్ లేకుండా వాహనాలను నడపడంతో పాటు, అతి వేగంగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్య సేవించి వాహనాలను నడపడం ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
గత సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 386 మంది మరణించారు. ఇట్లాంటివన్నీ దృష్టిలో ఉంచుకోని రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ట్రాఫిక్ నిబంధనలు అమలు పర్చడంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది అన్నారు
బైక్ ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రోత్సహించే దిశగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ఇతర పోలీస్ అధికారులతో కల్సి బైక్ ర్యాలీని నిర్వహించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు ఈ ర్యాలీలో సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, హన్మకొండ, ట్రాఫిక్ ఎసిపిలు జితేందర్ రెడ్డి, బాలస్వామి, హన్మకొండ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్, లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్ వేణుమాధవ్ తో పాటు ప్రొబేషనరీ ఎస్.ఐలతో ట్రాఫిక్ ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.