మక్తల్, ఫిబ్రవరి20(ప్రభన్యూస్) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి దేశం కోసం పని చేస్తుంటే కాంగ్రెస్ సహా దేశంలో ఇతర పార్టీలన్నీ తమ కుటుంబ కోసం పాలన చేస్తున్నాయని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. కుటుంబ పాలన కోసం పనిచేసే పార్టీలు కావాలా దేశం కోసం ప్రజల కోసం పనిచేసే బిజెపి కావాలా ఆలోచించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో దేశం కోసం నిరంతరం పనిచేస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు ఇచ్చి తెలంగాణలో బిజెపి కి అఖండ విజయం సాధించి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నేడు నిర్వహించిన విజయసంకల్పయాత్ర బహిరంగ సభకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర ఏళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిందన్నారు .ఇప్పటివరకు 25వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే తొమ్మిదిన్నర ఏళ్లలో అదనంగా మరో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పాలనలో కాశ్మీర్లో ఎస్సీలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించలేదని అంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్లో ఎస్సీలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించిన ఘనత బిజెపి దేనని అన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో రూపాయి దోపిడీ జరగలేదని కాంగ్రెస్ పాలనలో వేలకోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ కాంగ్రెస్ ఎంపీ నివాసంలో 400 కోట్ల రూపాయలు బయటపడడం కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి మరోసారి మోదీ ప్రభుత్వం కోసం తెలంగాణలో బిజెపిని గెలిపించాల్సిందిగా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల విజ్ఞప్తి చేశారు .
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీ. జితేందర్ రెడ్డి ,నాయకులు బంగారు శృతి, శ్రీ వర్ధన్ రెడ్డి, నాగురావ్ నామాజీ ,కొండయ్య ,మాదిరెడ్డి జలంధర్ రెడ్డి ,కొత్త కాపు రతంగ పాండు రెడ్డి ,పగడాకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.