హైదరాబాద్, ఆంధ్రప్రభ : యాసంగ వరి కోతలు మొదలు కావడంతో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయన్న అంశంపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బంధీగా జరిగేలా ముందుగానే చేయాల్సిన ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయో సమీక్షించనున్నారు.
ఈ యాసంగి సీజన్లో 121 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడివస్తుందని పౌరసరఫరాలశాఖ అంచానా వేసింది. ఇందులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు 75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో 7500 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పౌరసరఫరాలశాఖా ఆదేశించింది. ఇప్పటికే వరికోతలు మొదలైన నేపథ్యంలో మంగళవారం నాటి వీడియో కాన్ఫరెన్స్లో కొనుగోలు కేంద్రాల తెరిచే తేదీపైమరింత స్పష్టత రానుంది.