Tuesday, November 26, 2024

TS – ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చుచేసి ఒక్క ఎక‌రానికి నీళ్లు ఇవ్వ‌ని ఘ‌నుడు కెసిఆర్ – రేవంత్ రెడ్డి

మేడిగడ్డ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని, కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చినట్లు చెప్పారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్​ ప్రకారం పూర్తి కావాలంటే ఇంకా 2 లక్షల కోట్లు అవసరమవుతుందన్నారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వం .. కనీసం లక్ష ఎకరాలకు నీరివ్వలేదన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చానని కేసీఆర్​ పదే పదే అబద్దాలు చెప్పారన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే మేడిగడ్డ ప్రాజెక్ట్​ కుంగిందన్నారు. గత ప్రాజెక్ట్​ లు నిర్వహణ లోపం వల్ల కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్​ అక్కరకు రాకుండా పోయిందని ఆరోపించారు.

రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేన‌ని అన్నారు.. కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ.10, 500 కోట్లు ఖర్చవుతోంద‌ని రేవంత్ వివ‌రించారు. ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కెసిఆర్ తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు…

కాళేశ్వ‌రంపై ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు ఎల్&టీ కి లేఖ రాశార‌ని గుర్తు చేశారు. సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తిందని ,ఇది పూర్తిగా గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మేనంటూ ఆరోపించారు..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించార‌ని, ఈ మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవ‌ని అన్నారు.
నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎన్నికల ముందు స‌మ‌స్య అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీపై ఇంఛార్జ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చార‌ని, ఈ ప్రాజెక్ట్ నాణ్య‌త లోపంతో క‌ట్ట‌డం వ‌ల్ల‌, స‌రైన మెయిన్ట్ నెన్స్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇప్పుడు ఇది నిరూప‌యోగంగా మారిందంటూ రేవంత్ వివ‌రించారు.. ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసినా ఒక్క ఏక‌రాకి నీళ్లు ఇవ్వ‌ని కెసిఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. మేడిగ‌డ్డ క‌మిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా అంద‌రిపైనా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఎంత పెద్ద వాళ్ల‌నైనా జైలుకు పంప‌డం ఖాయ‌మ‌న్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement