గోదావరిఖని (ప్రభ న్యూస్) దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలను మాత్రం మరచిపోయిందని బిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే ప్రతిపక్షాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని కేసులు పెడుతుందన్నారు. వివేక్ కుటుంబం పెద్దపల్లి లో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్ర చేస్తుందన్నారు. వివేక్ కుటుంబ వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికే పెద్దపల్లిని వాడుకుంటున్నారన్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న వివేక్ దమ్ముంటే జనరల్ స్థానంలో పోటీ చెయ్యాలని, పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను అణగ దొక్కుతున్న వివేక్ కుటంబాని దళిత సమాజం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
పుట్టకో పార్టీ మార్చే వివేక్ కుటుంబానికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. కేంద్రంలో బిజెపి వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఈడి దాడులు సరికాదని, ప్రతిపక్షాలను ప్రతిపక్షాలను అరగదొక్కేందుకు సిబిఐ, ఈడీలను కేంద్రం వాడుకుంటున్నదన్నారు. ప్రజలు బిజెపి, కాంగ్రెస్ లను బొంద పెట్టాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జాబ్ క్యాలెండర్ అంతా భూటకం అని నొటిఫికేషన్ల ద్వారా అర్హులైన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి సాగును అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అతి తక్కువ కాలంలో విఫలమైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారన్నారు. రైతు హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో 36 గంటల నిరసన దీక్ష నిర్వహిస్తామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బారాసాను గెలిపించాలని కోరారు బారాసాను గెలిపించాలన్నారు.