Friday, November 22, 2024

TS – భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుల అక్ర‌మాల‌పై విచార‌ణ – కేబినెట్ నిర్ణ‌యం

హైద‌రాబాద్ – కొత్త రేషన్‌ కార్డుల జారీకి రేవంత్ రెడ్డి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేస్తున్నారు. స‌చివాల‌యంలో రేవంత్ అధ్య‌క్ష‌త‌న నేడు సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప‌లు నిర్ణ‌యాల‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలపై సానుకూలంగా కేబినెట్ స్పందించింది.. వారికి త‌గిన న్యాయం చేయాల‌ని నిర్ణ‌యించింది.

”ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4.56లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించాం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఓఆర్‌ఆర్‌ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్‌ సౌకర్యం. 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పిస్తాం. జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ. వంద రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్‌ నిర్ణయం. రెండు రోజుల్లో 93శాతం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించాం” అని వివరించారు.

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..
– కొత్త రేషన్‌ కార్డుల జారీకి ఆమోదం
– బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు
– 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయం
– 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయింపు
– ఔటర్‌ చుట్టూ మహిళా రైతు బజార్లు
– కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు.. విచారణ కమిటీ చైర్మన్‌గా జస్టిస్‌ పినాకిని చంద్రబోస్‌
– విద్యుత్‌ కొనుగోళ్లపైనా మరో కమిటీ.. చైర్మన్‌గా జస్టిస్‌ నరసింహారెడ్డి
– రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయం
– భ‌ద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అక్రమాలపై విచారణ జరపాలని నిర్ణయం

Advertisement

తాజా వార్తలు

Advertisement