Tuesday, November 26, 2024

TS: ఆటోను తాళ్ల‌తో లాగుతూ.. గ్యాస్ బండ నెత్తిన మోస్తూ.. కేంద్రంపై జ‌నాల ఫైర్‌.. ఎక్క‌డో తెలుసా!

Karimnagar: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో CPM ఆధ్వర్యంలో ఆటో కి తాళ్ళు కట్టి లాగుతూ, గ్యాస్ బండ ను నెత్తిమీద మోస్తూ.. వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుడికందుల సత్యం మాట్లాడుతూ పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు రోజు రోజుకు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నెత్తి మీద భారాలు వేస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచుకుoటున్నారని విమ‌ర్శించారు. అన్ని వస్తువులను జిఎస్టి లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ GST లోకి ఎందుకు తేవ‌డం లేదని అని ప్రశ్నించారు. ఒక లీటర్ కు కేంద్ర ప్రభుత్వం 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయలు వసూలు చేస్తూ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మూలంగా రవాణా చార్జీలు పెరుగుతాయని, రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమై ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 200/- రూపాయలు ఉన్న పెన్షన్ ను రెండువేల పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ, ఆనాడు 200/- రూ: లకు వచ్చిన నిత్యావసర సరుకులు నేడు రెండు వేలు పెట్టినా కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పుల్ల సంపత్, ఎల్కటూరి నారాయణ, కాశి పాక హనుమంతు, తోటపల్లి శంకర్, సుంకరిస్వామి, పుల్ల శ్రీనివాస్, పుల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement