ములుగు (ప్రభ న్యూస్): ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే మల్లంపల్లిలోని భవానీ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని ఎబివిపి జిల్లా కన్వీనర్ గాజు అజయ్ కుమార్ అన్నారు. గురువారం ములుగు మండలంలోని మల్లంపల్లి భవానీ హై స్కూల్ లో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎబివిపి నాయకులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ విషయంపై యాజమాన్యం మాట్లాడుతూ.. పాఠశాలలో పుస్తకాలు విక్రయించడం వాస్తవమేనని, మా పాఠశాల మా ఇష్టం మీరెవరు అడగడానికి అంటూ తమపై దురుసుగా ప్రవర్తించినట్టు ఎబివిపి విద్యార్థి నాయకులు ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ పాఠ శాల యాజమాన్యం మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. అక్రమంగా పాఠశాలలో పుస్తకాలు అమ్ముతూ విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు. అలాగే పాఠశాలకు వచ్చే విద్యార్థులను స్కూల్ వ్యాన్ ద్వారా కాకుండా ప్రైవేట్ వాహనం (జీబు) ద్వారా తీసుకస్తు పర్మిట్ కంటే ఎక్కువ మందిని తీసుకెలుతున్నారని, మరికొంత మంది విద్యార్థులను జీబుకు వెనుకాల నిల్చోబెట్టి తీసుకాస్తున్నారని అన్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా భవానీ స్కూల్ పై ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఎబివిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గాజు అజయ్, ములుగు నగర కార్యదర్శి, వంశీ, జిల్లా sfd కన్వీనర్ రాము, కార్యకర్తలు గణేష్, సన్నీ, విక్కీ, శ్రవణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.