మండుతున్న ఎండలతో గ్రేటర్‌లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండడంతో అదే స్థాయిలో కరెంటు వినియోగం పెరుగుతోంది. ఈ నెల 8న 65 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని అధికారులు తెలిపారు. అదే సమయంలో గతేడాది ఫిబ్రవరిలో 55 మిలియన్ యూనిట్లకు మించలేదన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో ఉందని, ఇలానే ఉంటే 70 మిలియన్ యూనిట్లు దాటే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
కొత్త కనెక్షన్లు కూడా కారణమే..
గతేడాది ఏప్రిల్-మే నెలల్లో అత్యధికంగా 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైతే ఈసారి మాత్రం మార్చి, ఏప్రిల్ నెలల్లో దాన్ని అధిగమించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడానికి ఎండల తీవ్రతకు తోడు కొత్త కనెక్షన్లు కూడా మరో కారణమన్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో కొత్త ఇండ్ల నిర్మాణాలతో పాటు భారీ హౌసింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండు వేసవి సీజన్‌లో అత్యధికంగా నమోదవుతున్నదని తెలిపారు. డిమాండుకు అనుగుణంగానే సరఫరా చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ క్షేత్ర స్థాయిలో వేసవి కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.