హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉపయోగపడే పథకాలు తీసుకొస్తుంటే.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు నచ్చడం లేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని సీఎం రేవంత్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు . ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. కానీ, కేసీఆర్ పదేళ్లపాటు మహిళలు, ఆడబిడ్డలను పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే మహిళల ఉసురు తగిలి ఆయన పదవి పోయిందన్నారు
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు.”మీ కష్టం చూసిన, మీ నైపుణ్యం చూసిన, మీ ఉత్పత్తులను చూసిన, మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద షాపులను కట్టించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా మీ వస్తువుల విక్రయానికి అవకాశం కల్పిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వశక్తి మహిళా సంఘాలకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారు. రానున్న రోజుల్లో కోటి మంది మహిళలు చేరాలని పిలుపునిచ్చారు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తే మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రగతికి విధాన పత్రం విడుదల చేశారు.
లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశం ఏర్పాటు చేయాలని 48 గంటల ముందు చెబితే మీరంతా హాజరై మహిళా శక్తిని నిరూపించారు. మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నెల రోజుల్లో మహాలక్ష‍్మిలకు షాపులను ఏర్పాటు చేసి వాటి చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. మీ కష్టాలను చూసే ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష‍్యంతోనే ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చామని గుర్తుచేశారు సీఎం రేవంత్.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష‍్మి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చే గృహలక్ష‍్మి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందరమ్మ ఇండ్లు, వారి కన్నీళ్లు తుడవాలని రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.
ప్రభుత్వం ఏర్పడే నాటికి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆడబిడ్డల ఆశీర్వచనాలతోనే మా ప్రభుత్వం ఏర్పడింది. వచ్చే ఐదేళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందరమ్మ ప్రభుత్వం తీసుకుంటుంది. మా సైన్యం మీరే, మా బలగం మీరే, రాబోయే రోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు నిర్వహిస్తామని చెప్పారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. కేసీఆర్ కుటుంబానికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. కేసీఆర్, మోడీ కలిసి రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1200 చేశారని ఆరోపించారు. మహిళలు గెలిపించిన తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని.. కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు, మహిళలు వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు రైతుల పంటలు కొనలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని రేవంత్ ప్రశ్నించారు
సదస్సులో మొదట మంత్రులతో కలిసి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి ఆయా సంఘాల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గోన్నారు.