Friday, November 22, 2024

TS – మైక్రో ఇరిగేషన్ మాయాజాలం.. బాధిత రైతులు 4 వేల పైనే…

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) మైక్రో ఇరిగేషన్ యూనిట్ల పేరిట రైతులను బురిడీ కొట్టించి కోట్లల్లో అవినీతి సొమ్మును కాజేసిన హార్టికల్చర్ అధికారుల బాగోతం ఇప్పుడు అధికార యంత్రాంగంలో అలజడి సృష్టిస్తోంది.బిందు సేద్యం పేరిట ..2 కోట్లు స్వాహా శీర్షికన బుధవారం ఆంధ్రప్రభ లో వచ్చిన కథనo అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాల పునర్విభజనకు ముందే అధికారులు పూర్వ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 4వేల మంది రైతుల నుండి మైక్రో ఇరిగేషన్ యూనిట్ల పేరిట సబ్సిడీ పోను మిగతా 10 శాతం డబ్బులు చెల్లించాలని నమ్మించి దరఖాస్తులు స్వీకరించారు. 90 శాతం సబ్సిడీతో పంట సాగుకు అవసరమైన మైక్రో ఇరిగేషన్ యూనిట్లు మంజూరు అవుతాయని ఆశపడి స్ప్రింక్లర్లు, పంట భూముల సేద్యానికి బిందు సేద్యం పైపులు పరికరాల వస్తాయని భావించి రైతులు ఉత్సాహంగా డీడీలు చెల్లించారు.

2019_20 వరకు మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ స్కీమ్ కొనసాగగా ఆదిలాబాద్ జిల్లా నుండి 2400 మంది రైతులు, నిర్మల్ జిల్లా నుండి 1850 మంది, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుండి మొత్తం 170 0 పైచిలుకు రైతులు డీ డీలు చెల్లించినట్టు శాఖా పరమైన క్షేత్రస్థాయి విచారణలో తేలింది. నాబార్డ్ నుండి నిధులు నిలిచిపోవడంతో మూడేళ్ల కిందట ఈ పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. రైతులు చెల్లించిన డబ్బులు తిరిగి వారికి అందించాలని హార్టికల్చర్ కమిషనరేట్ నుండి అన్ని జిల్లాలకు సర్కులర్లు వచ్చినా హార్టికల్చర్ అధికారులు బుట్ట దాఖలు చేశారు. తిరిగి మైక్రో ఇరిగేషన్ స్కీమ్ త్వరలో ప్రభుత్వం పునరుద్ధరిస్తదంటూ రైతులను నమ్మించి తిరిగి దరఖాస్తులు స్వీకరించారు. బిందు సేద్యం, స్పీoక్లర్ల కోసం రైతులు చెల్లించిన సుమారు రెండు కోట్ల నిధులను బ్యాంక్ అధికారుల ప్రమేయంతో హార్టికల్చర్ శాఖకు చెందిన ముగ్గురు జిల్లాస్థాయి అధికారులు తమ ఖాతాల్లోకి వేసుకొని రైతులను బురిడీ కొట్టించారు.

ఈ ఉదంతంలో ముగ్గురు అధికారులు జి శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ రావు రాథోడ్, కస్తూరి వెంకటేశ్వర్లను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, రైతుల సొమ్ము తిరిగి వారికి ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. రెండు కోట్ల స్కాంలో హార్టికల్చర్ శాఖలో అకౌంటేట్ గా ఔట్సోర్సింగ్ కింద పనిచేసిన ఓ ఉద్యోగి ప్రమేయం కూడా ఉన్నట్టు తెలింది. ఖాతాలు తారుమారు చేయడంలో ఓ బ్యాంకుకు చెందిన మేనేజర్, క్యాషియర్, అకౌంటెంట్ ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైతులల సొమ్ము కోట్లల్లో దిగమింగిన అధికారులు పక్కనే గల మహారాష్ట్రలో ఆదిలాబాద్ జిల్లాలో బినామీలా పేరిట భూములు సంపాదించుకోవడం, అపార్ట్మెంట్లు నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. ఇంటలెజెన్స్ వర్గాలు అధికారుల అవినీతి వ్యవహారంపై కూపి లాగుతున్నారు. మైక్రో ఇరిగేషన్ యూనిట్ల కోసం చెల్లించిన డబ్బు తిరిగి రైతుల ఖాతాలో వడ్డీతో సహా జమ చేయాలని , ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి క్లర్క్ నుండి కమిషనరేట్ వరకు అవినీతి తతంగాన్ని బయటకు రాగాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement