మెడికో స్టూడెంట్ రచనారెడ్డి పాయిజన్ ఇంజెక్షన్‌తో సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా రామంచంద్రాపురంలో నివాసం ఉంటున్న రచనా.. ఖమ్మం పట్టణంలోని మమతా మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చేస్తోంది. అయితే.. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో మెడికో ప్రీతి ఆత్మహత్య కూడా ఇదే తరహాలో ఉండడం ఇప్పుడు అంతా చర్చకు దారితీస్తోంది. సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్‌ను తట్టుకోలేక ప్రీతి విషం ఇంజెక్ట్ చేసుకుని అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ క్రమంలో రచనారెడ్డి ఘటన కూడా అలాగే ఉండడం కలచివేస్తోంది. రచనా కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చదువుతోంది. మరికొద్ది రోజుల్లో వైద్య విద్య పూర్తి కానుంది. ఇంతలోనే ఏం కష్టం వచ్చిందో కానీ.. ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని చాలామంది అంటున్నారు.
కారులోనే విషం ఇంజెక్షన్..
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం లో నివాసం ఉంటున్న రచనా రెడ్డి.. ఖమ్మం పట్టణంలో ఉన్న మమతా మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చేస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలో ఉన్న మమతా మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం ఔటర్‌లోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో కారులో విషం ఇంజెక్షన్ చేసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అటుగా వెళ్తోన్న వారు.. రచనా రెడ్డిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అమీనాపూర్ పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నరచనా రెడ్డిని మమతా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచింది. రచనా రెడ్డి మృతి వార్త తెలిసి ఆమె చదువుతున్న కాలేజీలో విషాదం అలుముకుంది.
విషాదంలో పేరేంట్స్ ..
కుమార్తె మరణ వార్త తెలుసుకున్న రచనా రెడ్డి తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎందుకు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె చేసుకుందా.. ఎవరైనా చేశారా?
సంఘటన జరిగిన సమయంలో కారులో రచనా రెడ్డి ఒక్కరే ప్రయాణిస్తున్నారా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకుందా.. ఎవరైనా వేధించడం వల్లనా అనే కోణంలో విచారిస్తున్నారు.
ఎంగేజ్‌మెంట్ అయిన అభ్యర్థితో మనస్పర్థలు..
రచనా రెడ్డికి ఇంతకుముందే ఎంగేజ్ మెంట్ అయ్యిందని, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరో వాదన వినిపిస్తోంది. అయితే.. ఆ అబ్బాయితో మనస్పర్థలతోనే ఆత్మహత్య నిర్ణయం తీసుకుందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.