Friday, November 22, 2024

TS – జ‌ల‌ వ‌న‌రుల‌కు మ‌హ‌ర్ద‌శ‌! పూడిక‌తీత‌కు సర్కారు రెడీ

చెరువుల పునరుద్ధరణపై రేవంత్​ ప్రభుత్వం దృష్టి
ఏప్రిల్‌ నుంచి పూడికతీత ప‌నులు ప్రారంభం
జిల్లాల వారీగా మొద‌లైన‌ సర్వే
5 నుంచి 10వేల ఎకరాల‌కు నీరందించే వాటికే ప్రాధాన్యం
తొలిదశ చేపట్టే ప‌నుల‌కు స‌న్నాహాలు
చెరువుల లిస్ట్ రెడీ చేస్తున్న ఇరిగేషన్‌ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని చెెరువుల్లో మిషన్‌ కాకతీయ కింద 27, 627 చెరువుల పూడిక తీయడంతో 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అయితే.. మిగతా వేలాది చెరువుల పూడిక తీయాల్సి ఉంది. 1956లో 70 వేల చెరువులున్నట్లు అధికారిక నివేదిక ఉండగా ఈ చెరువుల్లో కాకతీయులు నిర్మించినవి అధికంగా ఉన్నాయి. కళ్యాణ చాళుక్యులు, ఆసఫ్‌ జాహీలు, నిజాంలు నిర్మించిన చెరువులు కూడా ఉన్నాయి. అయితే.. 70 వేల చెరువుల్లో ప్రస్తుతం తెలంగాణలో 46, 531 చెరువులున్నాయి. వీటిలో పట్టణ ప్రాంత చెరువులు మినహా.. వ్యవసాయ యోగ్యమైన చెరువుల పూడిక తీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

12 వంద‌ల గొలుసుక‌ట్టు చెరువులు..

ఈ చెరువుల్లో క్రీ.శ. 1323 వరకు కాకతీయులు నిర్మించిన 12 వందల గొలుసు కట్టు చెరువులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మెదక్‌ 7,941. మహబూబ్‌ నగర్‌ 7,480,కరీంనగర్‌ 5,939, వరంగల్‌ 5,839, నల్గొండ 4,762, ఖమ్మం 4,517, ఆదిలాబాద్‌ 3,951, నిజమాబాద్‌ 3,251, రంగారెడ్డి 2,851 చెరువులు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన చెరువులను మొదటి దశలో పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 5 నుంచి 10వేల ఎకరాలకు సాగునీరు అందించే చెరువుల కట్టల బలోపేతం, పూడిక తీత, తూముల పునర్‌ నిర్మాణం చెయనున్నట్లు అధికారులు తెలిపారు.

పర్యాటక ప్రాంతాలుగా చెరువులు

- Advertisement -

రాష్ట్రంలో అత్యంత చారిత్రిక ప్రాధాన్యం గల చెరువులను పునరుద్ధరించి.. చెరువుల్లో బోటింగ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. చెరువుల దగ్గర నిర్మించిన రాజుల చరిత్రను తెలిపే బోర్డులు, పురావస్తు ప్రాధాన్యతలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రాచీన చెరువుల్లో క్రీస్తూ పూర్వం నాటి శాతవాహన రాజులు నిర్మించినవు కూడా ఉన్నాయి. అలాగే సహజసిద్ధంగా ఏర్పడి ఆదిమానవుల ఆవాసాలుగా నిలిచిన ప్రాధాన్యం గల చెరువులు కూడా ఉన్నాయి.

స్వాగతిస్తున్నాం

చెరువుల పునరుద్ధరణ అనివార్యమని రిటైడ్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌ రెడ్డి అన్నారు. నిజాం కాలంలో 244 టీఎంసీల నీరు చెరువుల ద్వారనే వ్యవసాయానికి అందేదని తెలిపారు. అయితే.. 1956 లెక్కల అనంతరం ప్రస్తుతం కబ్జాలకు గురికాగా మిగిలిన చెరువులనైనా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంపై ఆయన స్వాగతం తెలిపారు. వ్యవసాయానికి అత్యంత ఉపయోగకరమైన చెరువుల పునరుద్ధరణతో తెలంగాణ సస్యశ్యామలమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement