ఎన్నికల కమిషనర్ రాజీనామా, ఎలక్టోరల్ బాండ్ చెంప పెట్టు లాంటి సుప్రీం కోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీ చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీఏఏ ద్వారా ప్రజలను దైనందిన సమస్యల నుంచి పక్కదారి పట్టించి మత ఆధారంగా భారత లౌకిక సమాజాన్ని విభజించి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు.
సీఏఏకు వ్యతిరేకంగా గతంలోనే దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని, మైనారిటీలను దేశ ప్రధాన స్రవంతి నుంచి వేరు చేసి, ద్వితీయ శ్రేణులుగా మార్చే ప్రమాదకర ఎత్తుగడ ఇందులో ఇమిడి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీఏఏను ఉపసంహరిచుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బైటపడితే బీజేపీ బండారం బైటపడుతుందనే భయంతోనే సిఎఎను అకస్మాత్తుగా తెరైకి తెచ్చారని విమర్శించారు.