హైదరాబాద్: అంబేదర్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లకు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్కకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉపకారవేతనం తదుపరి విడుత నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న 7 వేల మందికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన తెలంగాణ విద్యార్థులకు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లు అందించామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు.
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న రవి పెరుపంగ అనే విద్యార్థి తాను కాలేజీ ఫీజు చెల్లించేందుకు రెండో విడుత స్కాలర్‌షిప్ ఇంకా విడుదల కాలేదని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన తనకు ఇప్పటికే అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ మంజూరయిందని వెల్లడించారు. అయితే ఇప్పటివరకు సెకండ్ ఇన్‌స్టాలమెంట్ రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఉపముఖ్యమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.