Monday, November 18, 2024

TS – సాగుకు నీరివ్వని చేతకాని ప్రభుత్వం – రేవంత్ పై జగదీష్ రెడ్డి గరం గరం

హైదరాబాద్ – బీఆర్ఎస్. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటుతున్న ఇంకా ఏం అభివృద్ధి పనులు చేయడం లేదని అన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్లు లేక ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరువు వచ్చిందని అన్నారు.

నాగార్జున సాగర్‌లో నీళ్లు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డికి చేత కావడం లేదని మండిపడ్డారు. రేవత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి బీఆర్ఎస్ నేతల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే రేవంత్ ప్రారంభిస్తూ.. గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలని చూస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాని కరువు పర్యటన చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డినీ ఎవరూ అడ్డుకోవడం లేదని… ఆయనే తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. మరో రెండు రోజుల్లో నల్లగొండ , భువనగిరి ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement