కేయూక్యాంపస్, ప్రభన్యూస్: ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్లకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్)-2022 షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి విడుదల చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర కళాశాల సెమినార్ హాల్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి షెడ్యూల్ను విడుదల చేశారు. కేయూ ఉపకులపతి, ఐసెట్ చైర్మన్ ఆచార్య తాటికొండ రమేష్, కన్వీనర్ ఆచార్య కె. రాజిరెడ్డి, వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, రిజిస్ట్రార్ ఆచార్య బైరు వెంకట్రాంరెడ్డితో కలిసి చైర్మన్ లింబాద్రి షెడ్యూల్ను విడుదల చేశారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, మిగతా విద్యార్థులు రూ.650 చెల్లించాలన్నారు. రూ.250 అపరాధ రుసుముతో జులై 11 వరకు రూ.500 అపరాధ రుసుముతో జులై 18 వరకు రూ.1000 అపరాధ రుసుముతో జులై 23 వరకు చెల్లించవచ్చన్నారు. హాల్టికెట్లను జులై 18 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అర్హత పరీక్ష జులై 27, 28వ తేదీల్లో మొత్తంగా మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష ఆన్లైన్లో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఐసెట్ వెబ్సైట్ను చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య పి. వరలక్ష్మీ, ఆచార్య కట్ల రాజేందర్, డాక్టర్ శ్రీరామోజు నర్సింహాచారి, డాక్టర్ అమరవేణి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..