హైదరాబాద్ – రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దనే ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుంది అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు నేడు ఆయన రేవంత్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారని, .. కానీ, ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే మొత్తం 201 యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. 200 యూనిట్లు దాటితే 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి.. మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హరీశ్ రావు కోరారు..
90 లక్షలు తెల్లకార్డులు .. పథకం మాత్రం 30 లక్షల మందికే …
ఇక, తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే.. ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుందని హరీశ్ అన్నారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు… కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, .. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారు.. ఇది సరైంది కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారని, .. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారని అని వెల్లడించారు.
ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారని, .. కానీ, ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తుంది అని హరీశ్ రావు అన్నారు. ఇది కూడా సరైన పద్ధతి కాదన్నారు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలన్నారు. నిజమైన పేదలకు న్యాయం చేయడమే మీ ప్రభుత్వ లక్ష్యమైతే.. మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుందన్నారు. హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్లు అవుతుందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నానని అన్నారు… నిజంగా పేదలకు సాయం చేయాలనే చిత్తశుద్ధి మీకుంటే.. వెంటనే పై మూడు విషయాల్లో తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.