Friday, November 22, 2024

గవర్నర్‌ వద్ద పెండింగ్ బిల్లులు – సుప్రీం కోర్టును ఆశ్ర‌యించిన తెలంగాణ ప్ర‌భుత్వం..

హైద‌రాబాద్ – రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం సుప్రీకోర్టుకి చేరింది.. . గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు.. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. గవర్నర్ మొత్తం పది బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయస్థానానికి వివరించింది. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదించుకున్న బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సబబుకాదని వెంటనే గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.


ఇది ఇలా ఉంటే గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వం 8 బిల్లులను తీసుకొచ్చింది. అందులో రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయడం, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వ విద్యాలయంగా మార్చడం, రాష్ట్రంలో మరి కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ చట్టం, పురపాలక చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులు సెప్టెంబర్ 13న ఉభయ సభల ఆమోదం పొంది.. గవర్నర్‌ ఆమోద ముద్ర కోసం రాజ్‌భవన్‌కు చేరాయి. వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలపగా.. మిగిలిన 7 బిల్లులు గత దాదాపు గత 6 నెలలుగా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు గత నెలలో జరిగిన శాసనసభలో మరో 3 కొత్త బిల్లులు ఉభయ సభల ఆమోదం పొందగా.. అవీ ప్రస్తుతం రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌ ఆమోద ముద్ర కోసం వేచి చూస్తున్నాయి. తాజాగా ఈ పెండింగ్ బిల్లుల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది..
పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు..
1.తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు

  1. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు
  2. అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు
  3. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు
  4. పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ
  5. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు
  6. మోటార్‌ వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లు
  7. పురపాలక చట్ట సవరణ బిల్లు
  8. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు
  9. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు
Advertisement

తాజా వార్తలు

Advertisement