హెదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్ జెన్కో) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల రాత పరీక్షణను వాయిదా వేసినట్లు యజమాన్యం ప్రకటించింది. టీఎస్ జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల కోసం అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు డిసెంబర్ 17వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. అదే రోజున ఇతర పోటీ పరీక్షలు ఉన్నందున జెన్కో నిర్వహించే ఏఈ రాత పరీక్షను వాయిదా వేయాల్సిందిగా పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణితో పాటు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కూడా కలిసి పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిన అనంతరం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జెన్కో పరీక్షను వాయిదా వేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి అంగీకరించారు. తదుపరి రాత పరీక్ష షెడ్యూల్ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.