Saturday, November 23, 2024

TS: పోలింగ్‌కు సర్వం సిద్ధం.. అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ.. నేటితో ప్రచారం బంద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రచారానికి నేటితో తెరపడనుండగా ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం సవాలుగా తీసుకుంది. ఎక్కడికక్కడ భద్రత, నిఘా కట్టుదిట్టం చేసి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఈసీ కృషి చేస్తోంది. ప్రచారంలో కోవిడ్‌ జాగ్రత్తలను క‌చ్చితంగా అమలు చేసేలా తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. నియోజ కవర్గంలో 2,36,430 మంది ఓటర్లుండగా, 305 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఉప ఎన్నికకు అవసరమైన ఈవీఎంలను ఇప్పటికే సిద్దం చేసి పంపిణీకి రెడీగా ఉంచారు.

భారీగా నగదు, మద్యం…
ఎన్నికల సంఘం అప్రమత్తతతో ఇప్పటివరకు రూ. 3,09,76,837 నగదును సీజ్‌ చేసింది. అదేవిధంగా 1068 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ రూ. 6.90లక్షలుగా అధికారులు చెప్పారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో రూ. 69,750 విలువైన 11.41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ. 10.60లక్షల విలువైన 14 కిలోల వెండి, 30గ్రాముల బంగారాన్ని జప్తు చేశారు. 66 చీరెలను, 50 షర్ట్‌లను స్వాధీనం చేసుకోగా వీటి విలువ రూ. 2.21లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. కాగా బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండి మరింత మద్యం, నగదును స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పోలింగ్‌ స్టేషన్‌ నిబంధనలు…
ఒక పోలింగ్‌ స్టేషన్‌ గ్రామీణ ప్రాంతంలో 1000 ఓట్లు, పట్టణాల్లో 1400మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ఉంటే మరో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఎక్కువగా ఉంటే అగ్జిలరీ బూత్‌లను ఏర్పాటు. బూత్‌ ఏరియా 20 చదరపు మీటర్లు ఉండాలి. ఇది ఐచ్చికమే అయినప్పటికీ సౌకర్యాలు కల్గి ఉండాలి.ఒకో పోలింగ్‌ స్టేషన్‌ ఓటర్లకు 2 కిలోమీటర్లు మించి ఉండరాదు. మత పరమైన కట్టడాల్లో పోలింగ్‌ స్టేషన్లను నిర్వహించరాదు. ఆస్రత్రి భవనాల్లో వీటిని ఎట్టిపరిస్థితు ల్లొ నూ ఏర్పాటు చేయరాదు. 200 మీటర్ల దూరంలో ఎలాంటి రాజకీయ పార్టీల కార్యాలయం ఉండకుండా చూడాలి

సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు..
ఎన్నికల్లో అవకతవకలు, అలజడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను సున్నిత లేదా సమస్యాత్మక ప్రాంతాలుగా పేర్కొంటారు. ఏదైనా పోలింగ్‌ స్టేషన్‌లో 75 శాతానికి మించి పోలింగ్‌ జరగడం, పోలైన ఓట్లలో 75 శాతానికిపైగా ఒకే అభ్యర్ధికి పోల్‌ అవడం, ఆయా పోలింగ్‌ స్టేషన్లలో జారీ చేయబడిన ఓటర్ల గుర్తింపు కార్డుల శాతం, ఇతర ఆధారాల పరిగణలోకి తీసుకుని సమస్యాత్మక స్టేషన్లు గుర్తిస్తారు. గత ఎన్నికల్లో జరిగిన నేరాలు, రీ పోలింగ్‌ వంటి అంశాలనూ పరిశీలిస్తారు. ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటికే ఇలా జాబితాను గుర్తించి కఠిన చర్యలకు ఈసీ సిద్దమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement