మాల్ ప్రాక్టీస్‌పై సీరియస్ యాక్షన్
మిగతా పరీక్షలు రాయకుండా డిబార్
28 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ఎగ్జామ్స్
ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4.78లక్షలు
సెకండ్ ఇయర్‌కు 5.02 లక్షల మంది
ఉదయం 6 నుంచి ఆర్టీసీ బస్సులు రెడీ
పరీక్షా కేంద్రాలకు చేరవేసేలా చర్యలు
ఆదేశాలు జారీ చేసిన ఎండీ సజ్జనార్
ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబతే క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. పరీక్షల్లో తప్పుడు విధానాలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో కాపీ కొట్టినా, ఎవరైనా వచ్చి పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు విధానాలు అవలంబించినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అటువంటి అభ్యర్థులు పరీక్షల మొత్తం రాయకుండా డిబార్ చేయనున్నారు. అంతేకాదు ఆ సమయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 19 వరకు జరగనున్నాయి.
పరీక్షలకు హాజరుకానున్న 9,80,978 మంది విద్యార్ధులు..
ఈసారి ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాల్లో 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు 8.45 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేయకుండా హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షలకు అనుమతిస్తారు.
ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు
నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలపై జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ కన్వీనర్‌గా ఉండగా, పరీక్షల నిర్వహణకు 30 మంది సెంటర్ ఇంచార్జిలు (సీఎస్), 70 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు (డీవో)లను నియమించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రశ్న పత్రాలు 11 స్టోరేజీ పాయింట్లలో భద్రపరుస్తారు.