టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సొంత పార్టీలో అసంతృప్తులను వెళ్లగక్కుకుతున్నారు సీనియర్ నేతలు. దాంతో రేవంత్ కి సీనియర్ నేతల వ్యవహరధోరణి తలనొప్పిగా మారింది. ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపించగల రేవంత్ ని ఏ అంశంతో ఇరకాటంలో పెట్టాలా అని చూసేవారు ఎక్కువే. అలాంటి వారికి ఓటుకి నోటు కేసు ఓ అస్త్రంగా మారింది.
ఇతర పక్షాలే కాక.. స్వపక్షం నుంచి కూడా ఈ విషయంలో రేవంత్ విమర్శలు ఎదుర్కొన్నారు.. ఈ కేసులో తనకేమి కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ ధీమాగా ఉన్నా.. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కొందరు అధికారులను ఎంపిక చేసి ఇకపై ఈ కేసు పర్యవేక్షణ, దర్యాప్తు బాధ్యత వారికే అప్పగించింది. ప్రభుత్వ నిర్ణయంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులను అవినీతి నిరోధక శాఖకి బదిలీ చేయనున్నారు.
ఓటుకు నోటు కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తుంది .. 2015లో తొలుత ఈ కేసు నమోదైనప్పుడు ఏసీబీతో కలిసి పనిచేసిన దర్యాప్తు అధికారి, ఇతర అధికారులు సేకరించిన వివరాలతో కలిపి రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఓటుకు నోటు కేసులో న్యాయస్థానంలో విచారణను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో అవినీతిని నియంత్రించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా త్వరలోనే ప్రభుత్వం నియమించే అవకాశం వుంది.
2015 తెలంగాణ శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి మద్ధతివ్వాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇచ్చిన కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, తదితరులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది .. ఈ వ్యవహారంపైనే రేవంత్ ని ఇతర పక్షాలు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటాయి. టిఆర్ ఎస్ సర్కార్ పన్నిన పన్నాగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. దీంతో రేవంత్ దూకుడికి కళ్ళెం వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.