న్యూ ఢిల్లీ – బీఆర్‌ఎస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీకి రాజీనామా చేసి నేడు బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు . ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్న బీబీ పాటిల్ ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ .. లోక్‌సభ ఎన్నికల సమయంలో నేతలంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారని అన్నారు. త్వరలో బీఆర్‌ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. బీజేపీ విధానాలకు ఆకర్షితులై సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరారని ఆయన తెలిపారు. కాగా, గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు కూడా బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.