సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎస్‌బీ ఆర్గానిక్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి.
ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్రమాద స్థలిని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా రెడ్డి, మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పరిశీలించారు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు.