నిజామాబాద్ ప్రతినిధి, (ప్రభన్యూస్) :తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగుతోంది. ఏటా దీపావళి బాణసంచా వ్యాపా రం చిన్నా, పెద్ద తేడాలేకుండా సందడిగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను కొందరు అక్రమార్కులు తమకు సిరులు కురిపించే వేడుకగా మార్చుకుంటున్నారు. పండుగకు ఇంకా రెండు రోజులే ఉండడంతో అధికారులు ఒకపక్క బాణసంచా విక్రయాలకు ఏర్పాట్లు చేస్తుంటే… సరుకు అక్రమమార్గంలో ఎలా తేవాలనే ప్రణాళికల్లో కొం దరు వ్యాపారులు ఉన్నట్లు సమాచారం..
అక్రమంగా బాణసంచా దిగుమతిని సహించేది లేదని విజిలెన్స్, వాణి జ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నా… ఏటా ఈ తంతు షరా మామూలుగానే సాగుతోంది.. దాంతో ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. దీపావళి పండుగకు రెండు రోజులే సమయం ఉండటంతో అధికారులు కూడా పండుగకు అన్ని ఏర్పాట్లూ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని డివిజన్‌లలో దీపావళికి టపాసులు అమ్ముకోవడానికి ప్రదేశాల ఏర్పాట్లు, లైసెన్స్‌ల మంజూరు చేశారు. జిల్లాలో నిబంధనలను పాటించకుండా పటాకుల దుకాణాలను ఏర్పాటు- చేస్తున్నారు. జనావాసాల మధ్య, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టకుండా పెద్ద ఎత్తున పటాకులు విక్రయిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పటాకులు దుకాణం ఏర్పాటు- చేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్, రెవెన్యూ, ఫైర్, పోలీస్, విద్యుత్ శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటు-ంది. ఇందుకోసం రూ. 500 చలానా కట్టి అగ్నిమాపక శాఖకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అనుమతులు వచ్చిన తర్వాత జనావాసాలకు దూరంగా సరైన వసతులు ఉన్న గోదాములను సిద్ధం చేసుకోవాల్సి ఉంటు-ంది. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. ఒకే చోట లక్షలాది రూపాయల విలువచేసే పటాలకులను నిల్వ ఉంచడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంత చేస్తున్న అధికారులు సంబంధిత వ్యక్తులు విక్రయించే సామగ్రి అధికారికంగా తీసుకువచ్చిందేనా..? లేక దొడ్డిదారిన తీసుకువచ్చి అమ్ముతున్నారా..? అన్న విషయాలను మాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. పండుగ కంటే పది రోజుల ముందు నుంచే ప్రారంభమయ్యే ఈ వ్యాపారంలో.. అక్రమాలకు పాల్పడి కోట్లలో ఆదాయం గడిస్తున్నారు. దొడ్డిదారిన దొంగసరుకు తీసుకొచ్చి కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారు..
జిల్లాలో సాగే ఈ వ్యాపారంలో ప్రతియేటా సగానికి పైగా అక్రమంగానే సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. జిల్లాలో అక్రమవ్యాపరం సాగుతోందడానికి గతంలో లారీల కొద్దీ పట్టుబడ్డ బాణసంచానే నిదర్శనంగా నిలుస్తోంది.. ఈ యేడాది బాణసంచా నిల్వలపై, విక్రయాలపై, రవాణాపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ వ్యాపారం సాగేదిలా…
నిబంధనల ప్రకారం వ్యాపారులకు లైసెన్స్‌లు కేటాయిం చిన తర్వాత మాత్రమే సామగ్రి కొనుగోలు చేయాలి.. కానీ.. కొందరు వ్యాపారులు ముందుగానే సామగ్రి తీసు కువచ్చి నిల్వ ఉంచుతున్నారు.. సరుకును తీసుకువ చ్చేవారు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.. ఈ కారణంగా.. చాలామంది వ్యాపారులు వారు తీసుకువచ్చే సరుకును వేబిల్లుల్లో తక్కువగా చూపిస్తారు.. ఒక లోడు లారీలో రూ.50లక్షల సరుకు ఉంటే… దానిని కేవలం రూ.5లక్షల సరుకు ఉన్న ట్టుగా చూపిస్తున్నారు. సరుకును రాత్రి పూట మాత్రమే రవాణా సాగిస్తారు.. జి ల్లా కేంద్రాలకు తీసుకువచ్చిన తర్వాత ఆ సామగ్రిని విభజించి, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఇలా అక్రమ రవాణా ద్వారా జిల్లాకు చేరుకునే దీపావళి సామగ్రి విలువ దాదాపు రూ.10కోట్లు ఉంటుందనేది అంచనా.. ఎలాంటి పేలుడు పదార్థాలనూ జనసంచారం ఉండే ప్రదేశాల్లో నిల్వ ఉంచడం కానీ.. బస్సుల్లో, రైలులో రవాణా చేయడం కానీ నేరం.. కానీ రాత్రిపూట నడిచే కొన్ని ప్రైవేటు బస్సుల్లో ఈ రవాణా సాగుతోంది.. మరి కొన్ని ప్రైవేటు పార్శిల్ సర్వీసుల్లో దీపావళి సామగ్రిరి కూడా సాదారణ పార్శిల్ కింద చూపించి రవాణా చేస్తున్నారు.
ఈ శాఖలు దృష్టి సారించాల్సిందే…
పటాకుల దుకాణాలను తాత్కాలికంగా ఏర్పాటు- చేసుకు నేందుకు అనుమతులు రాకు న్నా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక షెడ్లు వేసుకొని పటాకుల విక్రయాలను ప్రారంభించారు. పటాకుల వ్యాపారం చేసేవారు ప్రభుత్వానికి కమోడిటీ- (సున్నిత వస్తువు) పన్ను చెల్లించాల్సి ఉంటు-ంది, కానీ చా లా మంది ఎగవేస్తున్నారు. బిల్లులు, వేబిల్లులు లేకుండానే పటాకులను తరలిస్తున్నారు. జిల్లాలో ప్రతియేటా సాగు తున్న ఈ అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టాలంటే విజిలెన్స్ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక శాఖా అధికారులు తప్పనిసరిగా దృష్టి సారించాల్సిందే. అక్రమ వ్యాపారం సాగించే వ్యాపారులు సరుకు తీసుకువచ్చేటప్పుడు వేబిల్లు లో తక్కువగా చూపి ఎక్కువ సరుకును జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు.
అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫ రా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఆ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.. జిల్లాకు ఎంత స్థాయిలో పేలుడు పదార్థాలు వస్తున్నాయి..? అవి ఎక్కడెక్కడ ఎంతెంత స్థాయిలో ఉన్నాయి..? ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఏ మేరకు నష్టం వాటిల్లు తుంది..? అన్న విషయాలను నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన అగ్నిమాపకశాఖ కూడా నామమాత్రంగానే చర్యలు చేపడుతోందనే విమర్శలు ఉన్నాయి.. వీటికి తోడు విజిలెన్స్ నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టడం, మరోవైపు చెక్‌పోస్టులను ఎత్తివే యడం, ఈ రెండింటికీ తోడు జిల్లాలో కోట్ల రూపాయల టపాసుల పన్ను ఎగవేస్తున్నా… వారిపై వాణిజ్య పన్నుల శాఖ కన్నుమాత్రం పడటం లేదు.