నల్గొండ బీజేపీలో కట్టలుతెంచుకుంటున్న ఆగ్రహం
భూకబ్జా కోరుకు కండువకప్పుడే తప్పంటున్న నేతలు
ఇప్పుడు సీటు కూడా ఇస్తారా అని మండిపాటు
కేసుల్లో ఇరికించి జైలుకు పంపినోళ్లకు రెడ్ కార్పెట్ వేస్తారా?
సహించేది లేదంటున్న సూర్యాపేట బీజేపీ లీడర్లు
మౌనం వహిస్తున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం
ఆయన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ముద్దుబిడ్డ. అధికార పక్షమే ఆయన లక్ష్యం. ఎక్కడున్నా.. ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ అధికార పార్టీ కావాలి. తన మాట చెల్లాలి. అందుకు ఎన్ని నోట్ల కట్టలు చేజారినా పర్వాలేదు. అందుకే పదేళ్ల పాటు అధికారంతో తెలంగాణను తీర్చిదిద్దిన బీఆర్ఎస్… నేడు అధికార హీనమై.. ఆయన దృష్టిలో పనికిమాలిన పార్టీగా మారింది. ఇటీవలే నరేంద్ర మోదీ చలువతో మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే జోస్యంతో… ఈ సారి ఢిల్లీ కేంద్రంగా తన సత్తా చాటుకోవాలి. ఎంపీగా గెలవటం పెద్ద కష్టం కాదు. ఇక నల్గొండ లోక్‌సభ సీటు గుంజుడే ఆలస్యం. అందుకే గులాబీ కండువ విసిరికొట్టి.. కాషాయ తీర్థం పుచ్చుకున్నాడు. ఇది సరే.. ఇటు బీఆర్ఎస్ పెత్తనం, అటు కాంగ్రెస్ కంచుకోటలో నిత్యం ప్రజాపోరాటాలతో జనం మధ్య కాషాయ జెండాను ఎగురవేసిన బీజేపీ బిడ్డలు ఊరుకుంటారా? క్రమశిక్షణ పేరిట అధిష్టానం చర్యలకు తలొంచుతారా? కానీ, తగ్గేదేలే.. అంటూ సూర్యాపేట కాషాయబిడ్డలు రోడ్డెక్కారు. అమీతుమీ తేల్చుకుంటామని తొడలు చరుస్తున్నారు. ఇంతకీ బీజేపీలో అంతర్గత సమస్య రోడ్డు పాలు కావటానికి కారణమేంటీ?
గిరిజన భరోసా యాత్రే భీజం
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు 540 సర్వే నంబర్లోని 1,876 ఎకరాల గిరిజనుల భూములను స్థానిక బీఆర్ఎస్ నేతలు బినామీ పేర్లతో ఆక్రమించారని, వీరి వెనుక సైదిరెడ్డి హస్తం ఉందంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్రమణకు గురైన ఈ భూముల కోసం అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో గిరిజన రైతుల పక్షాన బీజీపీ నేతలు జరిపిన భూ పోరాటం 2021 ఫిబ్రవరిలోరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
గుర్రంబోడే అసలు టానిక్
గిరిజనుల భూముల కబ్జా పేరిట బీజేపీ చేపట్టిన ఆందోళనపై అప్పటి ఎమ్మెల్యే సైదారెడ్డి అసుర గణం ఊరుకోలేదు. దొరికినోళ్లను దొరినట్టు విరగదీశారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ కమలనాథుల బుర్రలు పగిలాయి. పోలీసు బలం ప్రయోగించారు. ఒకటా రెండా 80 రోజులు జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి సహా ఈ దాడిలో 30 మంది జైలు ఊచలు లెక్కపెట్టారు. అదొక్కటే కాదు… ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లగా… ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. పైగా బీజేపీ కార్యకర్తలపై చివ్వెంల, ఆత్మకూరు, నేరేడుచర్ల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ రోజుల్లో బీజేపీ చేపట్టిన ఈ ఉద్యమాలతోనే తెలంగాణలో పార్టీ బలం పుంజుకుందని బీజేపీ నమ్మకం.
సూర్యాపేట బీజేపీలో ఆందోళన..
ఈ గుర్రంబోడు ఘటనే బీజేపీకి మహత్తర టానిక్ గా పని చేసిన మాట నిజం. ఈ ఘటనల్లో అధికార పార్టీకి వకల్తాగా.. బీఆర్ఎస్ ముద్దుబిడ్డలా సైదిరెడ్డి తమపై పాశవివక దాడి చేస్తే… కనీసం తమ అభిప్రాయం తెలుసుకోకుండా.. పవిత్ర కాషాయ జెండాను కప్పుతారా? పోనీ అనుకుంటే ఏకంగా నల్గొండ లోక్‌సభ టిక్కెట్టు ఇస్తారా? అని సూర్యాపేట కాషాయ బలగం గగ్గోలు పెడుతోంది. సైదారెడ్డిని వ్యతిరేకించి బీజేపీలో చేరిన శ్రీలత రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను అన్నివిధాల వేధించిన వ్యక్తిని పార్టీలో చేరుకోవటమే తప్పు… ఆపై టిక్కెట్టు కూడా ధారాదత్తం చేస్తారా? తమ పోరాట ఫలితాన్ని అవమానిస్తారా? సైదిరెడ్డికి టిక్కెట్టు ఇస్తే సహించేది లేదని పార్టీ కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతున్నారు.
అధిష్టానం ఆలోచనేంటీ …
ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు.. మందలింపులు, శిక్షలకు తగిన సమయం కాదు.. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే..దక్షిణాదిలో బలం పెంచుకోవాలి. లోక్‌సభ స్థానాలు పెరగాలి. అవతలి వ్యక్తి ఒకప్పడు శత్రువుకు వెన్నుదన్ను కాస్తే… ఇప్పుడు మనకు దాసాను దాసుడు కాడా? అర్థ బలం, అంగబలం కావాలి. ఈ రెండు అతడిలో ఉన్నాయి. ముందు ఎంపీ ఎన్నికల్లో నిలబెడదాం. గెలిస్తే కేంద్రంలో మనమే.. అతడు ఓడినా కేంద్రంలో మనమే. ఎందుకీ లొల్లి అనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. మరి సైదిరెడ్డిని సహించలేని సూర్యాపేట కమలనాథుల పరిస్థితేంటీ.. ప్ప్..!