Tuesday, November 26, 2024

TS – ఆ మూడు అవినీతి, కుటుంబ పార్టీలు – ఓడించండి …. అమిత్ షా

హైద‌రాబాద్ – కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తాన‌ని .. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా . ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని.. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు రావాలి.. తెలంగాణ నుంచి 12కి పైగా స్థానాలు గెలిపించాలని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు అని అమిత్ షా చెప్పారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ప్ర‌సంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మజ్లిస్ గుప్పిట్లో ఉన్నాయ‌న్నారు. ఆ రెండు పార్టీలతో నిజాం పాలన విముక్త తెలంగాణ సాధ్యం కాదని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని ఆరోపించారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబ పార్టీ కాంగ్రెస్.. కేసీఆర్, కేటీఆర్ ల పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. ఇక ఒవైసీ కుటుంబ పార్టీ మ‌జ్లీస్ అంటూ ధ్వ‌జ‌మెత్తారు.. దేశంలో అన్నివర్గాల ప్రజల పార్టీ బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలు అని మండిపడ్డారు. 2జీ స్కాం, భోఫార్స్ కుంభకోణం ఇలా దేశంలో కాంగ్రెస్ చేయని అవినీతి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం మొదలు ఎన్నో అవినీతి చేశార‌ని,.. కవితకు లిక్కర్ స్కాంలో ఆరోపణలున్నాయని తెలిపారు.

ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించారని అమిత్ షా పేర్కొన్నారు. దేశం మోదీ పాలనలో సురక్షంగా ఉంద‌ని అన్నారు… పాకిస్తాన్ ఆటలు మోదీ సాగనివ్వలేదని అన్నారు. CAA తీసుకొచ్చి మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు సిటిజన్ షిప్ మోడీ సర్కారు ఇస్తోందని తెలిపారు. దేశ విద్రోహ శక్తులకు తప్ప CAA ఎవరికి వ్యతిరేకం కాద‌న్నారు. CAA సామాన్య శరణార్థులకు వ్యతిరేకం కాద‌ని అన్నారు.

తెలంగాణ అభివృద్ది కేవలం మోడీ సర్కారుతో సాధ్యం అని తెలిపారు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీని పీఎం చేయాలని.. కేసీఆర్ కు కేటీఆర్ ను సీఎం చేయాలని లక్ష్యం అని ఆరోపించారు. దేశంలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు కుటుంబాల కోసమేనని అన్నారు. మోడీ సర్కారు మాత్రం భారత కుటుంబ కోసం అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో మోదీకి దక్కుతున్న అపూర్వ స్వాగతం మోదీది కాద‌ని .. యావత్ భారత ప్రజలకు దక్కుతున్న గౌరవం అని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ ను మూడో అగ్ర దేశంగా నిలపడమే మోడీ లక్ష్యం అని అమిత్ షా తెలిపారు.

కాంగ్రెస్‌ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు: కిషన్‌రెడ్డి

- Advertisement -

”మోదీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర అభివృద్ధికి మోదీ నిధులు కేటాయించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకున్నది. కేసీఆర్‌ నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని ఎదగనివ్వలేదు. ఈసారి రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లు భాజపా గెలవాలి. మజ్లీస్‌ పీడ తొలగాలని పాతబస్తీ వాసులు కోరుకుంటున్నారు. రాహుల్‌ గాంధీ, పార్లమెంట్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు” అని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు.

శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి: బండి సంజయ్‌

”శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి . కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. వంద రోజులు దాటిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చుక్కలు కనిపిస్తాయి. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రూ.5లక్షల కోట్ల బడ్జెట్‌ కావాలి. రేషన్‌కార్డు నిబంధన పెట్టి లబ్ధిదారులకు కోత పెడుతున్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ గురించి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం లేదు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడి జైలుకు వెళ్లింది భాజపా కార్యకర్తలు. మా శ్రేణులు ఎప్పుడూ కుటుంబాల గురించి ఆలోచించలేదు” అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

ఎన్నిక‌ల వేళ సోష‌ల్ మీడియా విభాగ‌మే కీల‌కం…
ఎన్నిక‌ల స‌మ‌యంలో సోష‌ల్ మీడియా విభాగ‌మే కీల‌క‌మ‌ని, 24 గంట‌లు అందుబాటులో ఉంటూ ప్ర‌జ‌ల‌లోకి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు తీసుకెళ్లాల‌ని పిలుపు ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించేందుకు నేడు వ‌చ్చిన ఆయ‌న బీజేపీ సోషల్ మీడియా వారియర్స్‌తో స‌మావేశ‌మ‌య్యారు… కేంద్ర అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌లోకి చేర్చాల్సిన బాధ్య‌త మీదే అంటూ వారికి దిశ నిర్దేశం చేశారు.. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ భాజపాను తీసుకెళ్లాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement