ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం
కోటిన్నర మంది భక్త జనం వస్తారని అంచనా
డ్రోన్లతో నింతరం నిఘా
కమాండ్ కంట్రోలో నుంచే నియంత్రణ
ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు
గద్దెల చుట్టూ క్రౌడ్ కంట్రోల్ టీవీలు
నెంబర్ ప్లేట్ గుర్తింపునకు ప్రత్యేక కెమెరాలు
అటోమేటిక్ రికగ్నేషన్ వీటి స్పెషాలిటీ
గగనతల పర్యవేక్షణకూ డ్రోన్ల వినియోగం
జాతరలోని అన్ని సెంటర్లో భారీ టీవీ స్క్రీన్లు
అందుబాటులోకి మేడారం జాతర యాప్
వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. జాతరలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన సేవలందించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఈసారి మేడారంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను వినియోగించనున్నారు. సమయం వృథా కాకుండా, ఉత్తమ సేవలు అందించేందుకు పోలీసు శాఖ సాంకేతికను వినియోగించుకుంటోంది.
రద్దీ నియంత్రణ..
రద్దీ నియంత్రణకు కృత్రిమ మేధను ఉపయోగించనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రత్యేకమైన సాఫ్ట్ట్‌వేర్‌ను కెమెరాల్లో ఇన్‌స్టాలేషన్ చేశారు. వాటిని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశారు. చదరపు మీటరులో నలుగురు కంటే ఎక్కువగా ఉంటే కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందుతుంది. వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. అలాగే క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలు అమర్చి ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జాతరకు వచ్చే వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా అటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల్లో వీటిని అమర్చినట్టు తెలుస్తోంది.
మూడో కన్నుతో నిఘా..
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ములుగు పట్టణ శివారు గట్టమ్మ ఆలయం నుంచి పస్రా మీదుగా మేడారం వరకు.. జాతర పరిసరాలు, ప్రధాన కూడళ్లు, గద్దెల ప్రాంగణం, రద్దీ ప్రదేశాలు, పార్కింగ్ స్థలాల్లో మొత్తం 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 24 గంటలు వీటిద్వారా పర్యవేక్షించేందుకు మేడారంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ట్రాఫిక్, దొంగతనాలు, ఘర్షణలు, ప్రమాదాలు ఏం జరిగినా వెంటనే తక్షణ చర్యలు చేపట్టవచ్చు.
డ్రోన్ కెమెరాలు..
గగనతలం నుంచి జాతర పరిస్థితులను అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. ఇప్పటికే 5 డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చారు. వాటిని ప్రత్యేక సిబ్బందితో జాతరలో ఎగురవేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
ఎల్‌ఈడీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం
మేడారం జాతర వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేసింది. భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి జాతర విశేషాలను ప్రసారం చేయనుంది. జాతర సమయంలో విపరీతమైన రద్దీతో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోతుంటారు. అలా తప్పిపోయిన వారి ఫొటోలను ఈ టీవీ తెరలపై కనిపిచేలా ప్రసారం చేయనున్నారు.
ప్రత్యేక గైడ్ యాప్
మేడారం జాతర గైడ్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. జాతరకు సంబంధించిన వివరాలు పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, స్నాన ఘట్టాలు, ఆర్టీసీ బస్టాండు, వసతుల వంటివి ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలు ఇందులో పొందుపరిచారు. మేడారం ఎలా చేరుకోవాలి? రూట్ వివరాలు, హెల్ప్‌లైన్, ట్రాఫిక్, తదితర సమాచారం కూడా ఉండనుంది. త్వరలోనే ఈ యాప్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అందుబాటులో వచ్చిన నూతన టెక్నాలజీని జాతర విజయవంతానికి ఉపయోగించుకునేందుకు పోలీసు శాఖ రెడీ అయ్యింది.