అదిలాబాద్‌లో పార్క్ స్థలం కబ్జా
అక్రమార్కులకు కమిషనర్ అండ
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బుట్ట దాఖలా
వినతులను పట్టించుకోని నేతలు
ఆడుకునే స్థలం లేక చిన్నారుల పాట్లు
తమ స్థలం మింగేశారంటూ హైకోర్టుకు లేఖ..
వెంటనే స్పందించిన న్యాయమూర్తులు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్ల్, కమిషనర్ లకు నోటీస్ లు
మార్చి 17 లోపల నిజనిర్ధారణ చేయాలని ఆదేశం ..
తాము ఆడుకునే పార్కు స్థలం కబ్జా చేశారంటూ చిన్నారుల రాసిన లేఖపై తెలంగాణ హైకోర్టు పెద్దమనసు చాటుకుంది. బాలల లేఖనే పిల్ గా స్పీకరించి విచారణ చేపట్టింది. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వచ్చే నెల 7లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడం విశేషం. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని చేర్చడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి..
పార్కుస్థలం కబ్జా
ఖాళీ స్థలం కనిపిస్తే కన్నేయడం కబ్జాలు చేసి బోర్డులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇక ప్రభుత్వ స్థలమో,కాలనీల్లో పార్కుల కోసం వదలిన స్థలమో అయితే అక్రమార్కుల పండుగే. అడిగే వారు ఉండని అందినకాడికి దోచుకుంటున్నారు. కొద్దోగొప్ప పలుకుబడి ఉండటంతో లేదా బెదిరించి, భయపెట్టి లాక్కుంటున్నారు . దొంగపత్రలు సృష్టించి బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ చోటుచేసుకుంది. పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన అక్రమార్కులకు చుక్కెదురైంది.
పార్కు కోసం పిల్లలపోరాటం..
ఆదిలాబాద్ లోని బడుగు వర్గాల కోసం 1970లో హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం, పెద్దల వాకింగ్ కోసం 15 ఎకరాలను కేటాయించారు. ఈ భూమిలో 30 గుంటల స్థలాన్ని 20 ఏళ్ల క్రితమే కొందరు ఆక్రమించారు. మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించుకునేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని గ్రహించిన స్థానికులు ఆక్రమణలను నిలువరించాలంటూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేదు. తాము ఆటలాడుకునే స్థలం తమ నుంచి దూరమవుతుందని బాధపడిన చిన్నారులే నడుంబిగించారు. తమకు న్యాయం చేయడంంటూ ఏకంగా తెలంగాణ హైకోర్టు కు 23 మంది పిల్లలు లేఖరాశారు. పార్కు స్థలం కాపాడి న్యాయం చేయడంటూ వేడుకున్నారు. తాము ఆడుకోవడానికి ఉన్న ఏకైక పార్కు స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమిస్తుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులే వారికి కొమ్ముకాస్తున్నారని లేఖలో వివరించారు. ఆదిలాబాద్ నగర కమిషనర్ శైలజా వారికి వత్తాసు పలుకుతోందని…స్థలం ఎలా చేజిక్కించుకోవాలో కూడా వారికి సలహాలు ఇస్తోందని చిన్నారులు లేఖలో పేర్కొన్నారు. తక్షణం విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
హైకోర్టు పెద్దమనసు… అందరికీ నోటీసులు
చిన్నారుల లేఖను పెద్దమనసులో పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు…ఆ లేఖనే పిల్ గా పరిగణించి విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే , జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపి ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. కబ్జాదారులకు మున్సిపల్ కమిషనర్ శైలజ సలహాలిస్తున్నారని పిల్లలు ఆ లేఖలో పేర్కొన్నందున ఆమెను కూడా ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. చిన్నారుల సాహసాన్ని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటుండగా.. .న్యాయం ముందూ చిన్నా, పెద్దా తేడాలది అందరికీ అందుబాటులో ఉంటుందని తెలంగాణ హైకోర్టు మరోసారి నిరూపించింది.
తాత్కాలికంగా ఆలయ నిర్మాణ పనులు నిలిపివేత – ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖమర్…
హైకోర్టు ఆదేశాల మేరకు హౌసింగ్ బోర్డ్ రవీంద్ర నగర్ కాలనీల మధ్యన పార్కు స్థలం ఆక్రమణలపై విచారణ జరిపిస్తున్నాం. అప్పటివరకు అయ్యప్ప ఆలయ మందిర నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆలయ కమిటీకి సూచించాo. పిల్లలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టు స్వీకరించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులతో పార్కు స్థలం ఆక్రమణ పై సర్వే చేయించి పూర్తి వివరాలతో నివేదిక కోర్టుకు అందిస్తున్నాం.