హుజురాబాద్ బై ఎలక్షన్స్‌కు భారీగా పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. 72 గంటలకు ముందే ప్రచారం ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం స్థానికేతర వ్యక్తులు ఆ నియోజక వర్గాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా అక్కడే తిష్టవేసిన స్థానికేతరులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నికల బం దోబస్తులో భాగంగా ఇద్దరు అదనపు ఎస్పీలు, 15మంది ఏసీపిలు, 65 మంది సీఐలు, 180మంది ఎస్సైలను 2వేల మంది ఇతర పోలీస్ సిబ్బందిని ఈసి వినియోగిస్తోంది. 22 కంపెనీలకు చెందిన కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలతో సీపీ నేతృత్వంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఓటు వేసేందుకు ఇవే..
ఎన్నికల్లో ఓటువేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ స్లిప్పుల తోపాటు మరో 12 దృవీకరణ పత్రాలను అనుమతించనుంది. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, పాన్ కార్డు, మహాత్మాగాంధీ ఉపాధి హామీ జాబ్ కార్డు, పెన్షన్ కార్డు, ఆధార్ కార్డులను ఓటు వినియోగించేందుకు గుర్తింపుకార్డుగా చూపేందుకు అనుమతించింది.